ఘనంగా పగల్‌పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలు
సింహాచలం (విశాఖ): సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలు రెండవ రోజు ఆదివారం వైభవంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకీలో వేంజేపచేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ బేడామండపంలో విశేషంగా తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో విశేషంగా తిరువీధి నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 6వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
మార్మోగిన హరినామస్మరణ
కొమ్మాది: హరే కష్ణ, హరే రామ నామస్మరణతో సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఆదివారం మార్మోగింది. వారాంతపు పూజలు సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. రాధాకృష్ణులు, సుభద్ర, బలభద్ర జగన్నాథుడు, సీతారాములు, ఆంజనేయ, నరసింహస్వామి విగ్రహాలను వివిధ వర్ణాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.


