ఘనంగా తిరుప్పావై సేవ
పెందుర్తి: ‘ఓ చిన్నదానా పక్షులు అరుస్తున్నాయి. గరుడుడు వాహనంగా ఉన్న ఆ సర్వేశ్వరుని కోవెలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు. ఆ ధ్వని వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించినవాడు.. బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించిన వాడు.. సముద్రంలో శేషశయ్యపై యోగనిద్రలో ఉన్నవాడు.. జగత్తులన్నింటికీ కారణమైన సర్వేశ్వరుని మనసుల్లో ధ్యానిస్తూ యోగులు, మునులు హరీహరీ అంటూ మెల్లగా లేస్తున్నారు. ఆ గొప్ప ధ్వని మా మనస్సులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది. నీవు కూడా నిద్రలేచి రావమ్మా’.. అంటూ వేంకటాద్రి వాకిట 6వ పాశుర పఠనాన్ని అర్చకులు భక్తిపారవశ్యంలో చేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం వేకువజామున ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో అర్చక పరివారం స్వామివారిని మేల్కొలిపి హారతి, సేవాకాలం, శాత్తుమురై, తిరుప్పావై పారాయణం చేశారు. ప్రవచనం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తీర్థ గోష్టి, ప్రసాద వితరణ చేపట్టారు. ఈవో నీలిమ ఏర్పాట్లు సమీక్షించారు.
భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు


