
రిటైర్డ్ హోంగార్డుకు ఆర్థికసాయం
అనకాపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏపీఎస్‌ఈబీ సీలేరు శాఖలో డిప్యూటేషన్‌పై హోంగార్డుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కె.బ్రహ్మరాజుకు రెండు జిల్లాల్లో హోంగార్డుల ఒకరోజు వేతనం రూ.4,07,965 చెక్కును ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డు బ్రహ్మరాజు తన విధులను బాధ్యతాయుతంగా సమర్ధంగా నిర్వర్తించారని, ఆయన సేవలు ప్రశంసనీయమని అన్నారు. హోంగార్డుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, విధి నిర్వహణలో మరణించినా లేదా పదవీ విరమణ పొందిన హోంగార్డులకు ఆర్థిక సహాయం అందించేందుకు, ఈ రెండు జిల్లాల్లో హోంగార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయం సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.