
జైల్‌లో పటిష్ట రక్షణ చర్యలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఖైదీల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబు తెలిపారు. గతంలో 9 సీసీ కెమెరాలు ఉండగా, ప్రస్తుతం అదనంగా 32 కెమెరాలు ఏర్పాటు చేయడంతో 41 కెమెరాలు పనిచేస్తున్నాయి. జైలు విస్తీర్ణం దృష్ట్యా మరో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కెమెరాల ఫుటేజీలను నిరంతరం పరిశీలిస్తూ ఖైదీల ప్రవర్తనను గమనిస్తున్నామని, ఇటీవల ఒక ఖైదీ షేవింగ్ కిట్ దాచడం సీసీ కెమెరాల ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. జైలులో పూర్తిస్థాయి రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.