
స్పెషల్ డీఎస్సీతోనే పోస్టులు భర్తీ చేయాలి
అరకులోయటౌన్: ఆదివాసీలకు నూరుశాతం రిజర్వేషన్ తీర్మానం చేసి, ఏజెన్సీలో స్పెషల్ డీఎస్సీ ప్రకటించి, ఉపాధ్యాయుల పోస్టులన్నీ గిరిజన అభ్యర్థులచే భర్తీ చేసేలా బిల్లు ప్రకటించాలని స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కో–కన్వీనర్ పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం భవనంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈనెల 19న రైల్‌రోకోకు కమిటీ పిలుపు నివ్వడంతో ప్రభుత్వం స్పందించి కలెక్టర్ దినేష్ కుమార్, ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌లతో చర్చించి, ప్రభుత్వం నివేదిక కోరిందన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నుంచి షెడ్యూల్ ఏరియా ఆదివాసీ ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి, స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేసే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఇచ్చిన హామి నెరవేర్చడంలో కాలయాపన చేయకుండా కీలక ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆదివాసీలు పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. నేతలు మోహన్, జాన్‌బాబు, అశోక్, జగన్నాథం, నానిబాబు పాల్గొన్నారు.
రంపచోడవరం: గిరిజన అభ్యర్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివాసీ జెఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించిన రిలే దీక్షకు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తృప్తి జోగారావు మద్దతులు తెలుపుతూ మాట్లాడారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలకు నియమాకాల చట్టం ప్రకటించాలని జీవో నంబర్–3కి చట్ట బద్దత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని, షెడ్యూల్ ప్రాంత ఆదివాసీల సంక్షేమం కోసం కృషి ఎమ్మెల్యేల అందర్ని గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. స్పందనలో ఆదివాసీ నాయకులు ఐటీడీఏ పీవోను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. పెదగెద్దాడ సర్పంచ్ వడగల ప్రసాద్‌బాబు, పోడియం పండుదొర, చవలం శుభకృష్ణదొర, పండా పవన్‌కుమార్‌దొర, మడకం వరప్రసాద్, రాంబాబు, తెల్లం శేఖర్ పాల్గొన్నారు.
చింతూరు: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని ప్రకటించడంతో పాటు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి కాక సీతారామయ్య డిమాండ్ చేసారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ ఆదివాసీ పోస్టులను మినహాయించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జీవో నెం–3కు చట్టబధ్థత కల్పించాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను స్థానిక ఆదివాసీలతోనే భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీ నిరుద్యోగ యువతకు ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని, ఆదివాసీ చట్టాలు, హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని, జీవో నెం3పై స్పష్టమైన హామీ వచ్చేవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్, ఆత్రం ఉదయ్, మడకం లక్ష్మణ్, మడివి శైలు, భవానీ, రాధ, సంగీత, లక్ష్మీదేవి, గౌతమి , తరుణ్, పవన్ పాల్గొన్నారు.
స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ,
ఆదివాసీ జేఏసీ నాయకుల డిమాండ్
రిలే దీక్షలకు వివిధ సంఘాల మద్దతు

స్పెషల్ డీఎస్సీతోనే పోస్టులు భర్తీ చేయాలి

స్పెషల్ డీఎస్సీతోనే పోస్టులు భర్తీ చేయాలి