
కారుచీకట్లో సేవలు.. రోగుల వెతలు
● జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో లేని జనరేటర్లు
● సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో చికిత్సలు
● పట్టించుకోని అధికారులు
పాడేరు : జిల్లా వాసులకే కాకుండా ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రిలో సమస్యలు వెంటాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో కరెంట్ పోతే కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా ఓపీకి రోగులు వస్తుంటారు. మరో 200 మంది ఇన్‌పేషేంట్ రోగులుగా వైద్య చికిత్సలు పొందుతుంటారు. దీంతో జిల్లా ఆస్పత్రి ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉంటోంది. ఇంతా రద్దీగా ఉండే ఆస్పత్రిలో విద్యుత్ సమస్య ఎదురవుతోంది. ఏజెన్సీలో స్థానిక వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజు ఈదురుగాలులు, వర్షం పడుతూ ఉంటోంది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోతుంది. జిల్లా ఆస్పత్రిలో జనరేటర్లు ఉన్నా అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీంతో చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఒక్కోక్కసారి గంటకు పైగా ఆస్పత్రిలో క్యాజువల్టీ మినహా అన్ని విభాగాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. ఆ సమయాల్లో రోగుల కష్టాలు వర్ణనాతీతం. తప్పనిసరి పరిస్థితుల్లో రోగుల బందువుల సెల్‌ఫోన్ల వెలుతురులోనే వైద్య సేవలు కల్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వార్డుల్లో రోగులు బంధువులు కొవ్వత్తులు తెచ్చుకొని వెలిగించే పరిస్థితులు ఉన్నాయి. అత్యవసరమైన ఆపరేషన్ థియేటర్లో కూడా చీకట్లు కమ్ముకుంటున్నాయి. విద్యుత్ సరఫరా వల్ల నీటి సరఫరా నిలిచిపోతుంది. నిత్యం రోగులు అవస్థలు పడుతున్నాజిల్లా ఆస్పత్రి యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదని రోగులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

కారుచీకట్లో సేవలు.. రోగుల వెతలు