
సమ్మెతో చావో రేవో తేల్చుకుందాం..
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం జరగనున్న సమ్మెతో చావో రేవో తేల్చుకుందామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్మృత్యంజలి పార్కు వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కార్మికుల జీవన్మరణ సమస్యగా ఉందన్నారు. ప్లాంట్ ఉద్యమం ఒంటరి కాదని దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కార్మికవర్గం మరింత ఐక్యంగా ప్రభుత్వ, యాజమాన్యాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరింత పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్భందాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె విజయవంతం చేయాలన్నారు. స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, కార్పొరేటర్ గంగారావు, జిల్లా సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, ఆర్.ఎస్.వి.కుమార్, కె.ఎం.శ్రీనివాస్, నాయకులు వై.టి.దాస్, గణపతిరెడ్డి, కె.ఎస్.ఎన్.రావు, కె.సత్యనారాయణ, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
నేడు స్టీల్‌ప్లాంట్ పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె