
మత్స్యగెడ్డ నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. రేయింబవళ్లు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో ఇసుక అక్రమ వ్యాపారం భారీగా జరుగుతోంది. ఏజెన్సీలో అధికారికంగా రీచ్‌లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న గెడ్డలు, వాగుల నుంచి ఇసుకను సేకరిస్తారు. ఏజెన్సీలో ప్రధానంగా మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక అఽధికంగా లభ్యమవుతోంది. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మత్స్యగెడ్డ విస్తరించింది. ఈ గెడ్డ పొడవునా ఎక్కడికక్కడ అనధికారికంగా ఇసుక క్వారీలు వెలిశాయి. ఇసుకకు మన్యంలో ఉన్న డిమాండ్‌తో ట్రాక్టర్లు, టిప్పర్ లారీలు, వ్యాన్ల అపరేటర్లంతా భారీగా ఇసుకను తరలిస్తూ కాసులు ఆర్జిస్తున్నారు. మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో కూలీలను ఏర్పాటు చేసుకుని, రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను సేకరిస్తున్నారు.
● జి.మాడుగుల మండలంలోని బందవీధి శివారు చాకిరేవు, బొడ్డాపుట్టు, సింధుగుల ప్రాంతాలతో పాటు పాడేరు మండలం ఇరడాపల్లి, జి.ముంచంగిపుట్టు, పెదబయలు మండలం కోడాపల్లి కాజ్‌వే, గంపరాయి బ్రిడ్జి, చుట్టిమెట్ట, మంగబంద, హుకుంపేట మండలం కామయ్యపేట తదితర ప్రాంతాల్లోని మత్స్యగెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి.
మృత్యుకుహరంగా..
మత్స్యగెడ్డలో లోతుగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల మృత్యుకుహరంగా మారింది. లోతుగా గొయ్యిలు ఏర్పడటం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
● ట్రాక్టర్లు, వ్యాన్లు, టిప్పర్లు, లారీల ద్వారా ప్రతిరోజు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. మూడు టన్నుల ఇసుక దగ్గరగా అయితే రూ.6 వేలు, దూరం పెరిగితే రూ.10వేలు, మరింత దూరం పెరిగితే మాత్రం అధిక ధరకు వాహనాల అపరేటర్లు విక్రయిస్తున్నారు.
● మత్స్యగెడ్డ నుంచి భారీగా ఇసుక తరలిపోతున్నప్పటికీ రెవెన్యూ, పోలీసు అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి రవాణా అవుతున్న ఇసుక అంతా మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో అక్రమంగా సేకరించినదే. అయినప్పటికీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం ఇసుక వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.
రాత్రి, పగలు తేడా లేకుండా
యథేచ్ఛగా తవ్వకాలు
భారీ స్థాయిలో తరలించి
అధిక ధరలకు విక్రయం
లోతైన గోతులతో పొంచి ఉన్న
ప్రమాదాలు
మొక్కుబడిగా అధికారుల దాడులు
తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తాం
మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసు, రెవెన్యూశాఖల అధికారులకు తగిన ఆదేశాలిస్తాం.
– ఏఎస్ దినేష్‌కుమార్, కలెక్టర్, పాడేరు

మత్స్యగెడ్డ నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. రేయింబవళ్లు