
మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం
గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశం
చింతపల్లి: తాజంగిలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశించారు. గురువారం ఆయన పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్ అభిషేక్ గౌడతో కలిసి మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్మాణ పనులు జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్‌ను తొలగించి టెండర్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం రెండో విడత టెండర్లు ప్రక్రియ పూర్తి అయిందన్నారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లతో సకాలంలో నిర్మాణ పనులను పూర్తిచేసేలా ఇంజనీరింగ్ అదికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పనులను నవంబర్ నాటికి పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ మ్యూజియం నిర్మాణానికి 22 ఎకరాలు కేటాయించగా 11 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.35 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.3 ఖర్చు చేయడం జరిగిందన్నారు. వీటికి నిధుల కొరత లేదన్నారు. ఈ మ్యూజియం ప్రారంభానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారన్నారు. అనంతరం రాజుబందలో నిర్మించిన మల్టీపర్పస్ కేంద్ర భవనంతోపాటు గిరిజనులు నిర్మించుకుంటున్న పక్కా ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసు, పాడేరు ఈఈ డేవిడ్ రాజు, డీఈ రఘునాథ్ పాల్గొన్నారు.