
రూ.200 వ్యయం
బియ్యం ఉచితం..
గతేడాది అక్టోబర్‌లో రేషన్ పంపిణీ చేస్తున్న
ఎండీయూ వాహన సిబ్బంది (ఫైల్)
కొయ్యూరు: మంప పంచాయతీ.. దీని పరిధిలో ఆర్.దొడ్డవరం, గంగవరం, టిటోరాళ్ల గ్రామాలు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపుగా వందమంది కార్డుదారులు ఉన్నారు. వీరంతా రేషన్ పొందేందుకు మంప డీఆర్ డిపోకు వెళ్లాలి. దగ్గరమార్గం ఉన్నా రెండు పెద్ద కొండలు ఎక్కి దిగాలి. వర్షాకాలంలో ఈ మార్గంలో వెళ్లి రావడం సాధ్యం కాదు. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదు. దీంతో వీరంతా వీరవరం, దుచ్చర్తి, దాకోడు, బందమామిళ్ల మీదుగా 50 కిలోమీటర్ల దూరంలోని మంప డిపోకు వచ్చి రేషన్ తీసుకువెళ్తున్నారు. ఇందుకు రవాణా చార్జీలు రెండు పక్కలా సుమారు రూ.150 వరకు ఖర్చవుతోంది. రేషన్ తెచ్చుకునేందుకు ఒక రోజు కేటాయించాలి. మంపలో సరియైన హోటళ్లు లేకపోవడంతో టిఫిన్ తిని రోజంతా అర్ధాకలితో ఉంటున్నారు. ఆర్.దొడ్డవరంలో డీఆర్ డిపో ఏర్పాటుచేస్తే అవస్థలు తప్పుతాయని ప్రాధేయపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎంకు వినతిపత్రం ఇచ్చినా..
ఇదే సమస్యపై గతేడాది అక్టోబర్‌లో సీపీఐ నేతలు అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో నవంబర్‌లో ఎండీయూ వాహనం ఆయా గ్రామాలకు వెళ్లి రేషన్ పంపిణీ చేసింది. ఆ తరువాత నుంచి పరిస్థితి మళ్లీ మామూలే. సీఎం ఆదేశాలను మండల స్థాయి అధికారులు పట్టించుకోలేదు. అప్పటి నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రేషన్ తెచ్చుకుంటున్నారు. డీజిల్ ఖర్చులిస్తే మీ గ్రామాలకు రేషన్ తెచ్చి ఇస్తామని ఎండీయూ నిర్వాహకులు చెబుతున్నారని వారు వాపోతున్నారు.
ఇలాంటి గ్రామాలెన్నో..
● మఠం భీమవరం పంచాయతీలో పెదలంక కొత్తూరు, బుగ్గిరాయి, పుట్టకోట, కాకుల మామిడి, జ్యోతుల మామిడి గ్రామాల గిరిజనులు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని పలకజీడి డీఆర్‌డిపోకు వచ్చి రేషన్ తీసుకోవాలి. ఈ మార్గంలో ప్రైవేట్ వాహనాలు తిరిగే అవకాశం లేనందున కాలినడకే శరణ్యం.
● యూ.చీడిపాలెం పంచాయతీలో మర్రిపాకల, జెర్రిగంది, గంగవరం, నీలవరం, తీగలమెట్ట, ఎర్రగొంద గ్రామాల గిరిజనులు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని యూ.చీడిపాలెం డీఆర్ డిపోకు రావాలి. సరియైన రహదారి సౌకర్యం లేనందున వర్షాకాలంలో వీరు రేషన్ పొందే పరిస్థితి ఉండదు.
చర్యలు తీసుకుంటాం
ఆర్.దొడ్డవరం గ్రామానికి దివ్యాంగుల కోటాలో డీఆర్ సబ్‌డిపో మంజూరైంది. అయితే ఆర్హత లేని వారు దీనికి దరఖాస్తు చేయడంతో పోస్టు భర్తీ చేయలేదు. డీలర్ల నియామకాలు జరిగితే వెంటనే అక్కడ ఒకరిని నియమించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
– ప్రశాంత్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ, కొయ్యూరు
సబ్ డిపో ఏర్పాటుతో మేలు
సబ్‌డిపో ఏర్పాటు చేసే అధికారం, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలకు మాత్రమే ఉంది. సబ్‌డిపో ఏర్పాటుకు వారు చర్యలు తీసుకుంటే ఆర్.దొడ్డవరం, గంగవరం, టిటోరాళ్ల గ్రామాల గిరిజనులకు ఏదొకవిధంగా రేషన్ పంపిణీ చేస్తాం. రేషన్ తెచ్చుకునేందుకు ఆయా గ్రామాల గిరిజనులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది.
– విజయకుమార్, బీఎం, జీసీసీ, కొయ్యూరు

రూ.200 వ్యయం