
ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు ధర్మ పోరాటం
సాక్షి,పాడేరు: గిరిజన డీఎస్సీతో నూరుశాతం గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటీడీఏల ఎదుట రిలే దీక్షలతో ధర్మపోరాటం చేస్తామని,ఆదివాసీ జేఏసీ నేతలు తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏ ఎదుట జేఏసీ నేతలు రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి మాట్లాడుతూ ఏజెన్సీలో నూరుశాతం ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, సీఎం చంద్రబాబు హమీ ఇవ్వడాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. ఆదివాసీలకు న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం తక్షణమే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ నియామక చట్టం చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మెగా డీఎస్సీ–2025లో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు,హక్కులు ఉన్నాయని,వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ చట్టాలు అమలుజేస్తే ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు శాంతియుతమైన ధర్మపోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపడంతో పాటు,అన్ని ఐటీడీఏల వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు బోయపల్లి సింహాచలం, మినుముల ప్రసాద్, పలాసి తిరుపతిరావు, కిరసాని కిషోర్, తామర సురేష్, నాగరాజు, సోంబాబు, సురేష్, శంకర్,అనిల్ పాల్గొన్నారు.
గిరిజన సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి
గిరిజన డీఎస్సీకి ప్రత్యేక నోటిఫికేషన్ ప్రకటించాలి
ఆదివాసీ జేఏసీ నేతల డిమాండ్