
సరిహద్దులో ముమ్మర తనిఖీలు
అప్రమత్తమైన పోలీసులు
ముంచంగిపుట్టు: మావోయిస్టుల కదలికలు అధికమయ్యాయన్న సమాచారంతో సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలో సీఆర్‌పీఎఫ్ పోలీసులు బలగాలు పహారా కాస్తూ రాకపోకలపై నిఘాను పెంచారు. ముఖ్యంగా మారుమూల బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, కుమడ, కుజభంగి మార్గాల్లో కల్వర్టులు, వంతెనలను డాగ్, బాంబ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన ఒనకడిల్లీ, మాచ్‌ఖండ్, జోలాపుట్టు గ్రామాల్లో సైతం బీఎస్‌ఎఫ్ బలగాలు సరిహద్దు రాకపోకలపై నిఘా పెంచాయి. ప్రయాణికుల బ్యాగులు,లగేజీలు పరిశీలించి విడిచి పెట్టారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులతో గస్తీ ఏర్పాటుచేశారు.