
అన్నదాతల మోములో ఆశలమోసులు
సాక్షి,పాడేరు: ఈ ఏడాది రబీలో రెండవ పంటగా గిరిజనులు సాగు చేసిన వరి పొట్టదశలో కళకళాడుతోంది. దీంతో అన్నదాతల మోములో ఆశలు మోసులెత్తుతున్నాయి. గత నెలతో పాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రబీ పంటకు ఎంతో మేలు చేశాయి. వేసవిలో అధిక వర్షాలు కురవడం ఇదే మొదటిసారి కావడంతో జిల్లా వ్యాప్తంగా రబీ పంటలకు సాగునీటి సమస్య లేకుండా పోయింది. ప్రస్తుతం వరిపంట ఆశాజనకంగా ఎదుగుతుండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్‌లో 2,361 హెక్టార్లలో వరిపంటను సాగు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే రబీ సాగుకు వినియోగించారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి వస్తుంది.వర్షాలు,వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దిగుబడులు అధికంగా ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు తెలిపారు.
కలిసిరానున్న రబీ
మేలు చేసిన వర్షాలు
జిల్లాలో 2,361 హెక్టార్లలో వరి సాగు