
పురోగతి లేని సచివాలయ భవనాలు.!
● మధ్యలో నిలిచిన నిర్మాణాలు
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
● నీరుగారుతున్న గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యం
గూడెంకొత్తవీధి: ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న ఎంతో ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చకచకా సాగాయి. కొన్ని చోట్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి.
గూడెంలో సగమే పూర్తి
గూడెం కొత్తవీధి మండలంలో 18 సచివాలయాల నిర్మాణాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలో ప్రస్తుతానికి 9 మాత్రమే పూర్తయ్యాయి. పేరుకు మండల కేంద్రం అయినా గూడెంకొత్తవీధిలో సచివాలయం అసంపూర్తిగానే ఉండిపోయింది. పాత పంచాయతీ భవనంలోనే సచివాలయం కొనసాగుతోంది. ఆర్వీ నగర్‌లోనూ ఇదే పరిస్థితి. అసంపూర్తిగా భవనం మొండిగోడలతో దర్శనమిస్తోంది. ఇక రైతు భరోసా కేంద్రాలు 18కి 10 మాత్రమే పూర్తయ్యాయి. 8 పూర్తి కావల్సి ఉంది. భవనాలున్నా వినియోగించని తీరు మండల కేంద్రంలో కొన్ని శాఖలకు సొంత భవనాలు లేకపోగా.. మరికొన్ని శాఖలకు సొంత భవనాలున్నా వాటిని వినియోగించని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి కోసం గతంలో ఒక భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ పోస్టే లేకుండా పోవడంతో ఈ భవనం నిరుపయోగంగా ఉంది. కనీసం ఇతర శాఖల అవసరాలకు అయినా ఈ భవనాన్ని వినియోగించడంలేదు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారుల కోసం ఇక్కడ మరో భవనం నిర్మించారు. దాన్ని కూడా ఆ శాఖ అధికారులు వినియోగించడం లేదు. దీంతో అది తుప్పల మధ్య నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అసంపూర్తి భవనాలను పూర్తి చేయకపోవడంపై స్థాఽనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన సచివాలయ భవనాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.
భవనాల పూర్తికి చర్యలు
మండలంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిధులు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
– జ్యోతిబాబు,
పీఆర్ మండల ఇంజినీరింగ్ అధికారి

పురోగతి లేని సచివాలయ భవనాలు.!

పురోగతి లేని సచివాలయ భవనాలు.!