
నీ తోడే నా కనుచూపుగా...
● దాతల దీవెనలతో ఒక్కటైన అంధ జంట ● అతిథులు రాకతో కళకళలాడిన ప్రేమ సమాజం
డాబాగార్డెన్స్: ప్రేమ సమాజంలో ఆప్యాయత, అనుబంధాల మధ్య పెరిగిన యువతి శివజ్యోతికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రతో ఘనంగా వివాహం జరిగింది. ప్రేమ సమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 7.05 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక.. దాతృత్వం, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల శుభ ధ్వనులు, దాతలు, ప్రముఖుల ఆశీస్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టుకతోనే కంటిచూపును, తల్లిదండ్రులను కోల్పోయిన శివజ్యోతికి ప్రేమ సమాజమే కుటుంబంగా నిలిచి ఈ వేడుక జరిపించింది. డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజం అనాథాశ్రమంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న శివజ్యోతి.. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం(కంప్యూటర్) పూర్తి చేశాడు.
అతనూ అంధుడే. కోయంబత్తూరులోని పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరడంతో.. ఆయన సోదరుడు రమణ ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించాడు. దీంతో వారు శివజ్యోతి గురించి అతనికి చెప్పడం, ఇరు వర్గాలు అంగీకరించడంతో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది.
అండగా నిలిచిన దాతలు
ప్రేమ సమాజం నిర్వహించిన 114వ వివాహంగా ఇది చరిత్రలో నిలిచింది. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినిత్ లోహియా సహా ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహన్‌రావు, కమిటీ ప్రతినిధులు మట్టుపల్లి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి అప్పలరాజు, గణపతిరావు, రిటైర్డ్ ఏసీపీ దివాకర్, ఉప్పల భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దాతృత్వ స్ఫూర్తి అడుగడుగునా కనిపించింది. ప్రేమ సమాజం కమిటీ శివజ్యోతికి అండగా నిలిచింది. ఆమె పేరిట రూ. లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్, ఒక తులం బంగారం(తాడు), సారె సామగ్రిని అందజేసింది. కార్యవర్గం అనుమతితో కంచర్ల అన్నపూర్ణ ఏసీ ఆడిటోరియంలో వివాహం ఘనంగా జరిగింది. అతిథులకు రాత్రి విందుతో సహా వివాహ ఖర్చులన్నీ ప్రేమ సమాజమే భరించింది. గత 14 ఏళ్లుగా ప్రేమ సమాజంలో జరిగే అనాథ బాలికల వివాహాలకు సహాయం అందిస్తున్న అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్, అమిత్ లోహియా, వినీత్ లోహియా నాయకత్వంలో రూ.69,500 విలువైన వస్తువులను నూతన వధూవరులకు బహూకరించారు.