
పెళ్లయిన మూడు రోజులకే..
● స్నేహితులతో స్నానానికి వెళ్లి
నవ వరుడు దుర్మణం
రావికమతం : మండలంలో టి.అర్జాపురం శివారు పాత కొట్నాబిల్లి గ్రామానికి చెందిన ఆసరి జగదీష్ (26)కు అదే గ్రామానికి చెందిన ఉమ(22)తో గిరిజన సంప్రదాయంలో ఈ నెల 8 న గురువారం రాత్రి వివాహం జరిగింది. స్నేహితులకు పెళ్లి పార్టీ ఇవ్వడానికి వెళ్లిన జగదీష్ అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. గ్రానైట్ క్వారీ వద్ద భారీ గొయ్యిలో ఈతకు దిగి దుర్మరణం పొందాడు. ఈ సంఘటన పాత కొట్నాబిల్లిలో చోటు చేసుకొంది. రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపిన వివరాల మేరకు ఐదుగురు మిత్రులకు పెళ్లి పార్టీ శనివారం గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ వద్ద ఇచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. జగదీష్ మాత్రం తవ్వకాల వల్ల ఏర్పడిన గోతిలో ఈతకు దిగాడు. మిగిలిన స్నేహితులకు ఓపిక లేక ఒడ్డునే ఉన్నారు. జగదీష్ ఈతకు దిగి మునిగి పోయిన సంగతి స్నేహితులు గమనించలేదు. స్నేహితులకు మద్యం మత్తు వదిలాక జగదీష్ అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడని భావించి ఊర్లోకి వచ్చేశారు. శనివారం రాత్రి జగదీష్ రాకపోవడంతో బంధువుల ఇళ్ల వద్ద విచారించారు. ఆదివారం క్వారీ వద్ద గోతిలో శవమై తేలాడు. ఘటనపై మృతుడి తండ్రి సీతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు.