
ఘనంగా అమ్మవార్ల ఉత్సవాలు
సాక్షి,పాడేరు: మండలంలోని మినుములూరు, గుర్రగరువు గ్రామాల్లో మోదకొండమ్మతల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. మినుములూరులో సర్పంచ్ లంకెల చిట్టమ్మ ఆధ్వర్యంలో భక్తులకు భోజన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మోదకొండమ్మతల్లి ఘటాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కోలాటం, ఒడిశా బ్యాండ్‌ల మధ్య మోదమ్మ ఉత్సవ విగ్రహం, ఘటాలను ఘాట్‌లోని మోదకొండమ్మతల్లి పాదాల గుడి వరకు ఊరేగించారు. మోదమ్మకు ఘటాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గుర్రగరువు గిరిజనులు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వనుగుపల్లి పంచాయతీ బిరిమిశాలలో జాంకారమ్మ తల్లి ఉత్సవాలు కమిటీ అధ్యక్షుడు డోకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
హుకుంపేట: గిరిజనుల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవాలు మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా ముగిశాయి. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. శతకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు భక్తులు ఊరేగింపు తరలివచ్చారు. సర్పంచ్ సమిడా వెంకటపూర్ణిమ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పాంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అమ్మవార్ల ఉత్సవాలు