
పొగబారిన ఆశలు.. దగా పడిన రైతులు
విలీన మండలాల్లో పొగాకు రైతుల ఆశలు అడియాసలయ్యాయి. సాగుకు ముందు పొగాకు కొనుగోలుకు హామీ ఇచ్చి, ప్రోత్సహించిన కంపెనీ దిగుబడి వచ్చాక కొనుగోలు చేయడానికి అడ్డగోలు నిబంధనలు పెట్టి నట్టేట ముంచింది. గత ఏడాది పొగాకు రైతులకు లాభాలు కురిపించడంతో ఈ ఏడాది మరింత ఆశతో విస్తారంగా సాగు చేశారు. వారంతా పూర్తిగా తమ గుప్పిట్లో ఇరుక్కోగానే ఆ కంపెనీ బురిడీ కొట్టించింది. దీంతో రైతులు లబో దిబోమంటున్నారు.
ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం
పొగాకును కంపెనీకి విక్రయిస్తున్న రైతులు
కొనుగోలు
సమయంలో కొర్రీలు
కంపెనీ మాటలు నమ్మి పొగాకు
పండించిన రైతులు
బయటకు చెబితే సరకు కొనబోమని బెదిరింపులు
చింతూరు: విలీన మండలాలైన కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరుకు చెందిన పొగాకు రైతులు ఓ కార్పొరేట్ కంపెనీ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. గత ఏడాది తాము పండించిన లంక పొగాకును అధిక ధరకు కొనుగోలు చేసిన సదరు కంపెనీ ఈ ఏడాది మాత్రం కొర్రీలు పెట్టి మరీ తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో తాము నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఈ విషయాన్ని బయటకు చెబితే మీ సరుకు కొనుగోలు చేయబోమంటూ కంపెనీకి చెందిన ప్రతినిధులు బెదిరింపులకు దిగడంతో సదరు రైతులు తమపేర్లు చెప్పేందుకు కూడా ముందుకు రావడంలేదు.
కంపెనీ రాకతో ఆశలు
గత ఏడాది ఈ ప్రాంతంలోకి ఓ కార్పొరేట్ కంపెనీ అడుగుపెట్టి తాము అధిక రేటుకు పొగాకు కొనుగోలు చేస్తామని, గతంలో లంక వ్యాపారులు ఎలా కొనుగోలు చేస్తే .. అలాగే కొనుగోలు చేస్తామని, సొమ్ము కూడా వెంటనే చెల్లిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కాగా గతంలో మాదిరిగా పొగాకును బుట్టల్లో కాకుండా వర్జీనియా పొగాకు మాదిరిగా బేళ్లలో కట్టాలని కంపెనీ ప్రతినిధులు తెలపడంతో రైతులు ఆ మాదిరిగానే ఒక్కో బేలులో 50 నుంచి 80 కిలోల వరకు సరకును నింపారు. దీంతో గత ఏడాది తమ వద్దనుంచి కాడలతో(లింకుకోత) సహా కిలో రూ.160 నుంచి రూ.180 వరకు కంపెనీ కొనుగోలు చేయడంతో మంచిగా లాభాలు వచ్చాయని రైతులు తెలిపారు.
ఈ ఏడాది కొర్రీలు
గత ఏడాది లాభాలు రావడంతో ఈ ఏడాది రైతులు మరింత అధికంగా పొగాకును పండించారు. నాలుగు మండలాలకు చెందిన సుమారు వెయ్యిమంది రైతులు సుమారు నాలుగు వేల ఎకరాల్లో లంకపొగాకును పండించారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టడంతో ఎకరాకు 10 బేళ్ల వరకు దిగుబడి వచ్చింది. కాగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సదరు కంపెనీ తమవద్ద కాడలతో(లింకుకోత) సహా కోసిన పొగాకును కొనుగోలు చేస్తుందని భావించినట్లు రైతులు తెలిపారు. తీరా కాడలతో పొగాకు కోసిన అనంతరం ఈ ఏడాది తాము కాడలతో సరకును కొనుగోలు చేయలేమని కేవలం ఆకులు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆ విధంగానే బేళ్లను నింపాలని కంపెనీ ప్రతినిధులు తెగేసి చెప్పారని రైతులు వాపోయారు. ఇప్పటికే తాము కోతకోసి ఆరబెట్టడం జరిగిందని ఈ సమయంలో కాడతో కొనుగోలు చేయబోమనడం సరికాదని ప్రాథేయపడినా కాడతో ఉంటే సరకు కొనేది లేదంటూ తెగేసి చెప్పారని రైతులు తెలిపారు. దీంతో చేసేదిలేక ఎకరాకు రూ 10 వేల నుంచి రూ. 13 వేల వరకు అదనంగా పెట్టుబడి పెట్టి కాడలు తొలగించాల్సి వచ్చిందని రైతులు వాపోయారు.
ధర తగ్గించి..
కంపెనీ షరతు మేరకు అదనపు పెట్టుబడితో కాడలు తొలగించినా సరకు కొనుగోలులో సైతం అనేక ఇబ్బందులు పెట్టినట్లు రైతులు తెలిపారు. గత ఏడాది కాడలతో కిలో రూ.160 నుంచి రూ.180 వరకు కొనుగోలు చేసిన కంపెనీ ఈ ఏడాది కాడలు లేకుండా కేవలం ఆకులతో రూ.180 నుంచి రూ. 200 వరకు కొనుగోలు చేసినట్టు చెప్పారు. కాడలతో కొనుగోలు చేయకపోవడంతో బరువుతగ్గి తూకంలో తమకు నష్టం వాటిల్లడంతో పాటు కాడలు తీసేందుకు అదనపు పెట్టుబడి కూడా అయిందని వారు వాపోయారు. ఈ ఏడాది సదరు కంపెనీ కంటే గతంలోని లంక వ్యాపారులే కాడలతో సహా అధిక ధరకు సరకు కొనుగోలు చేశారని, తాము కంపెనీతో ఒప్పందం చేసుకోవడంతో వారి షరతు మేరకు కాడల ను తొలగించాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. కాగా కాడలు తీసిన సరకును లంక వ్యాపారులు కొనుగోలు చేయరని దీంతో చేసేదిలేక కంపెనీకే విక్రయించవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశా రు. ఈ ఏడాది కొంతమందికి లాభాలు తక్కువ రాగా, మరి కొంతమందికి ఎకరాకు రూ. 30వేల వరకు నష్టంవచ్చినట్టు రైతులు వాపోయారు.

పొగబారిన ఆశలు.. దగా పడిన రైతులు

పొగబారిన ఆశలు.. దగా పడిన రైతులు

పొగబారిన ఆశలు.. దగా పడిన రైతులు