ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు? | - | Sakshi
Sakshi News home page

ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?

May 5 2025 8:20 AM | Updated on May 5 2025 8:44 AM

ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?

ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?

● చందనోత్సవం టికెట్ల లెక్కల్లో భారీ తేడా ● అధికారిక లెక్కలకు, వాస్తవానికి వ్యత్యాసం ● అంతరాలయ దర్శనంపైనా విమర్శలు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం టికెట్ల విక్రయాలు, దర్శనాల నిర్వహణకు సంబంధించి దేవస్థానం విడుదల చేసిన జాబితాలో పలు వ్యత్యాసాలు, అస్పష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల సంఖ్య, తెల్లవారుజామున కల్పించిన అంతరాలయ దర్శనాల విషయంలో అధికారుల లెక్కలపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో కె. సుబ్బారావు పేరిట ఆదివారం విడుదలైన జాబితా ప్రకారం.. ఈ ఏడాది చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్లు ఆఫ్‌లైన్‌లో 15,495, ఆన్‌లైన్‌లో 7,591 కలిపి మొత్తం 23,086 విక్రయించారు. అలాగే రూ.1000 టికెట్లు ఆఫ్‌లైన్‌లో 13,803, ఆన్‌లైన్‌లో 3,999 కలిపి మొత్తం 17,802 జారీ చేశారు. రూ.1500 టికెట్లు కేవలం ఆఫ్‌లైన్‌లో 3,000 విక్రయించినట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా 496 అంతరాలయ టికెట్లుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం మొత్తంగా 44,384 టికెట్లు విక్రయించినట్లు జాబితాలో ఉంది. అయితే గత నెల 24 నుంచి 29 వరకు రోజువారీగా టిక్కెట్ల విక్రయాల జాబితాను పరిశీలిస్తే.. మొత్తం 41,519 టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొన్నారు. దీంతో దేవస్థానం విడుదల చేసిన మొత్తం లెక్కకు, రోజువారీ లెక్కలకు మధ్య 2,865 టికెట్ల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. తెల్లవారుజామున అంతరాలయ దర్శనం కేవలం 496 మందికి మాత్రమే కల్పించినట్లు అధికారులు చూపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం రోజు ఉదయం చాలా మందిని అంతరాలయ దర్శనానికి అనుమతించినట్లు భక్తులు, స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వారి అంచనా ప్రకారం అంతరాలయ దర్శనం పొందిన వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అంటున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేవారు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ప్రకటించారు. తీరా ఈవో ప్రకటనకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే టిక్కెట్ల విక్రయాలు పెరిగినట్లు దేవస్థానం పేర్కొంది. 2024లో మొత్తం 32,461 టికెట్లు విక్రయించగా, ఈ సంవత్సరం 44,384 టికెట్లు అమ్ముడైనట్లు తెలిపింది. రూ.300, రూ.1000 టికెట్లలో గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 12,889 టికెట్లు విక్రయించామని పేర్కొంది. గత ఏడాది ఆన్‌లైన్‌లో రూ.300, రూ.1000 టికెట్లు కలిపి 8,216 విక్రయించగా, ఈ ఏడాది 11,590 అమ్ముడైనట్లు నివేదించారు. అంటే ఆన్‌లైన్‌లో 3,374 టికెట్లు అదనంగా విక్రయించామని చెబుతున్నారు. అయితే రూ.1000 టికెట్లు తొలిరోజు మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, మిగతా ఏ రోజుల్లోనూ ఆ టికెట్లు లభించలేదని భక్తులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకత కొరవడిందని విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement