
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం, 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర శతనామా వళి పూజ భక్తిశ్రద్ధలతో చేశారు. ఈ ఆర్జిత సేవలో పాల్గొన్న ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అంతేకాకుండా ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 9:30 గంటల నుంచి ఆలయ కల్యాణ మండపంలో ఈ వేడుకను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంచేపచేశారు. వేద పండితులు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించారు.

అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు