
టెండర్
ఈపీడీసీఎల్‌కు
● సబ్ స్టేషన్లు పంచుకుంటున్నారు ● ఈపీడీసీఎల్ పరిధిలో సబ్ స్టేషన్ల నిర్మాణంలో హస్తలాఘవం ● మూడు సంస్థలకే అన్ని ప్యాకేజీల అప్పగింత
సాక్షి, విశాఖపట్నం : ఆస్తులు పంచుకున్నట్లు.. ఈపీడీసీఎల్‌లో పనులు పంచేసుకుంటున్నారు. అధికారుల అండదండలతో ఈ భాగంలో పనులు నీకు.. ఆ భాగంలో నీకు.. అంటూ వాటాలు వేసుకుంటూ మరీ.. టెండర్ల ప్యాకేజీలు అప్పనంగా అప్పగించేస్తున్నారు. సర్కిల్ ఏదైనా ఎలాంటి సబ్‌స్టేషన్ అయినా ఆ మూడు సంస్థలకే పనులు కట్టబెట్టేలా విద్యుత్ శాఖ అధికారులు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి టెండర్ ధర కంటే లెస్‌కు వేస్తే మరోసారి అధికంగా వేస్తారు. అయినా వారికే కాంట్రాక్టులు కట్టబెడతారు. ఇటీవల దాదాపు 35 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులన్నీ మూడు కాంట్రాక్టు సంస్థల జేబుల్లోకే వెళ్లిపోయాయి.
గత ఏడాది కాలంలో ఈపీడీసీఎల్ పరిధిలో 35 సెమీ ఇండోర్ సబ్ స్టేషన్లు, అవుట్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సర్కిళ్ల వారీగా టెండర్లు పిలిచారు. ఇక్కడే విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్కనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం సర్కిల్, విశాఖపట్నం (పాతసర్కిల్) పరిధిలో 3 సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్లు, 6 అవుట్‌డోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పాటు కనెక్టింగ్ లైన్స్, ఇంటర్ లింకింగ్ లైన్స్ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్యాకేజీగా టెండర్లు పిలిచారు. అదేవిధంగా పాత తూర్పుగోదావరి సర్కిల్ పరిఽధిలో 8 అవుట్ డోర్ సబ్‌స్టేషన్లు, 8 ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులకు, పాత పశ్చిమ గోదావరి సర్కిల్ పరిధిలో 5 అవుట్‌డోర్, 5 ఇండోర్ సబ్‌స్టేషన్లు, ఇతర పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. మొత్తం 35 సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల్ని మూడు ప్యాకేజీలుగా సర్కిళ్ల వారీగా విభజించారు.
మీరు లెస్‌కు.. మేం ఎక్సెస్‌కు..
సదరు కాంట్రాక్టు సంస్థలు కూడా ఈ పనుల విషయంలో రింగ్‌గా వ్యవహరించినట్లు ఈపీడీసీఎల్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక ప్రాంతంలో టెండరు విలువ కంటే తక్కువకు కోట్ చేస్తే.. మరో ప్రాంతంలో అధిక ధరకు టెండరు దాఖలు చేశారు. వారు ఎలా టెండర్ ఫైల్ చేసినా.. ఇవ్వాలన్నదే విద్యుత్ అధికారుల అంతిమ లక్ష్యంగా వ్యవహరించారని సమాచారం. విజయనగరం, విశాఖపట్నం సర్కిళ్ల పరిధిలో రూ.21.77 కోట్లకు టెండర్లు పిలవగా సదరు సంస్థ 1.31 శాతం అధికంగా రూ.22.06 కోట్లకు టెండర్ వేసింది. అయినా సదరు కాంట్రాక్టు సంస్థకే టెండరు దక్కింది. అదేవిధంగా పాత పశ్చిమ గోదావరి సర్కిల్ పరిధిలో రూ.16.42 కోట్లకు టెండర్లు పిలిస్తే 1.35 లెస్‌తో రూ.16.2 కోట్లతో టెండర్లు దాఖలు చేసిన సంస్థకు అప్పగించారు.
13.6 శాతం లెస్‌కు వేస్తే నాణ్యత ఎలా.?
ఇక పాత ఈస్ట్‌గోదావరి సర్కిల్ పరిధిలో విచిత్రంగా తక్కువ ధరకే పనులు చేసేస్తామంటూ సదరు సంస్థ టెండరు దాఖలు చేసింది. ఈ సర్కిల్ పరిధిలో రూ.18.58 కోట్లకు టెండర్లు పిలిచారు. అయితే అధికారుల అనుయాయ కాంట్రాక్టు సంస్థ ఏకంగా 13.6 శాతం లెస్‌కు అంటే రూ.16.06 కోట్లకు టెండర్ ఫైల్ చేసింది. విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, కనెక్టింగ్ లైన్స్, ఇంటర్‌లింకింగ్ లైన్స్‌ని పూర్తి నాణ్యతతో నిర్మించాలి. కానీ సదరు సంస్థ 13.6 శాతం లెస్‌కు వేసినప్పుడు తక్కువ సొమ్ముతో నాణ్యమైన సబ్‌స్టేషన్లు నిర్మాణం ఎలా సాగుతుందన్న ఆలోచన విద్యుత్ శాఖ అధికారులకు వచ్చినా వాటన్నింటినీ పక్కనపెట్టేసి పనులు కట్టబెట్టెయ్యడం గమనార్హం. కాంట్రాక్టు సంస్థలకు విద్యుత్ శాఖ అధికారులు దాసోహం అన్నట్లుగానే విద్యుత్ శాఖ అధికారులు ఈపీడీసీఎల్ పరిధిలో ఏ భారీ టెండర్ అయినా.. సదరు మూడు సంస్థలకే ప్రథమ ప్రాధాన్యమిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కిల్‌కి ఒక కాంట్రాక్టర్ చొప్పున..
సర్కిళ్ల వారీగా పిలిచిన ఈ పనులను ఈపీడీసీఎల్‌ను శాసిస్తున్న మూడు కాంట్రాక్టు సంస్థలకు వచ్చేలా టెండర్ల నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కాంట్రాక్టు సంస్థలు తమ క్వాలిఫికేషన్లకు అనుగుణంగానే టెండర్ల నిబంధనలు దగ్గరుండి మరీ తయారు చేసినట్లు తెలుస్తోంది. వారి అడుగులకు మడుగులొత్తే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారు. తాము ముందుగా అనుకున్నట్లుగానే టెండర్లను మూడు భాగాలుగా విభజించి ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో కాంట్రాక్టర్‌కు పంచేశారు.

టెండర్