
రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ మృతి
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని వెంకయ్యపాలెం–చిలకలగెడ్డ మధ్యలో శుక్రవారం జరిగిన రోడ్ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అందజేసిన వివరాలు.. ఎన్.ఆర్.పురం పంచాయతీలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న జన్ని మచ్చయ్య (45) కె.లచ్చయ్యతో కలసి స్కూటీపై శృంగవరపుకోట వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా అరకు నుంచి వస్తున్న వాహనం వీరిని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో మచ్చయ్య స్పాట్‌లోనే మరణించారు. గాయపడిన లచ్చయ్యను శృంగవరపుకోటకు స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం లచ్చయ్యను విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు.
సంతల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలి
డుంబ్రిగుడ: గిరిజన ప్రాంతంలోని వారపు సంతల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి మండల కేంద్రంలోని వారపు సంతలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంతల్లో తాగునీటి సదుపాయం, సామాజిక మరుగుదొడ్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటుచేయాలన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతుల అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు చేయాలన్నారు. రైతుల తమ సరకులను భద్రపరుచుకునేందుకు కోల్ట్ స్టోరేజీలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సంతలో రహదారి అధ్వానంగా ఉందని, బాగు చేయాలని కోరారు. నాయకులు సుబ్బారావు, అప్పారావు, గాసి తదితరులు పాల్గొన్నారు.