
మా నమ్మకాన్ని గెలిపించిన ‘కోర్ట్’
● వైజాగ్‌లో చిత్రం బృందం సందడి
డాబాగార్డెన్స్: నగరంలో కోర్ట్ చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. శివాజీ మంగపతిగా, ప్రియదర్శి పులికొండ లాయర్ పాత్రలో నటించగా, హీరో హర్ష రోషన్, హీరోయిన్లు శ్రీదేవి, విషిక, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్ నగరంలోని ఓ హాటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్ట్ సినిమా మా అందర్నీ గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మరోసారి ప్రేక్షకులు నిరూపించారన్నారు. విశాఖ సీతమ్మపేట, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాని సహ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కిందన్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.25 కోట్ల మేర కలెక్షన్స్ రావడం చిత్ర విజయానికి నిదర్శనమన్నారు. శ్రీవేంకటేశ్వర ఫిల్మ్ అధినేత విజయ్‌భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.