● ఐటీడీఏ పీవో అపూర్వభరత్
చింతూరు: వ్యాధి నిరోధక శక్తిని పెంచి, ఆరోగ్య సంరక్షణకు దోహదపడే టీకాలను పిల్లలందరికీ తప్పనిసరిగా వేయించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదివారం తెలిపారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా చింతూరు డివిజన్‌లోని పిల్లలందరికీ టీకాలు వేయించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. టీకాలు వేయించడం వల్ల వ్యాధికారక క్రిములను ఎదుర్కొని, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, మరణాలు సంభవించకుండా చేస్తాయని తెలిపారు. టీబీ, పోలియో మహమ్మారి, గవదబిళ్లలు, కోరింత దగ్గు, మీజిల్స్, టెటానస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నియంత్రిస్తుందని ఆయన తెలిపారు. డివిజన్ పరిధిలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని పీవో సూచించారు. గర్భిణులు, చిన్న పిల్లల పేర్లను యూవిన్ పోర్టల్‌లో సంబంధిత ఆరోగ్య కార్యకర్త ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతిఒక్కరూ ఆయుష్మాన్ భారత్ ఐడీ నంబర్ పొందాలని, ఈ నంబరు ద్వారా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఉచితంగా వైద్యం పొందే అవకాశముంటుందని ఆయన తెలిపారు. డివిజన్‌లోని ప్రతిఒక్కరికీ ఐడీ నంబరు వచ్చేలా వైద్యాధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించినట్టు పీవో తెలిపారు.