నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పరీక్ష సమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలు
పాడేరు తలారిసింగి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బెంచీలు
చింతపల్లి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డీఈవో బ్రహ్మాజీరావు
హాజరుకానున్న విద్యార్థులు
11,766
రెగ్యులర్ 11,564
ప్రైవేటు 202
బాలురు 5,476
బాలికలు 6,290
తెలుగు మీడియం 8,140
ఇంగ్లిషు మీడియం 3,626
ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో టెన్త్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.రంపచోడవరం,పాడేరు,చింతూరు డివిజన్ల పరిధిలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాం.పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించే లక్ష్యంగా అన్ని మండలాల ఎంఈవోలు,ఇతర పరీక్షల నిర్వాహక అధికారులను అప్రమత్తం చేశాం.20 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం.
– పి.బ్రహ్మాజీరావు, డీఈవో
పరీక్షలు ఎప్పటివరకంటే
సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ
సాక్షి,పాడేరు: జిల్లాలో 71 కేంద్రాల్లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు.
జిల్లాలోని 22 మండలాల పరిధిలో 71 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ టెన్త్ పబ్లిక్ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. వీటిలో 23 ఎ కేటగిరీ కేంద్రాలు, 38 బి కేటగిరీ కేంద్రాలు, 10 సి కేటగిరీ కేంద్రాలుగా గుర్తించారు. 20 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అన్ని గదుల్లోను బెంచీలను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు,సురక్షిత తాగునీరును అందుబాటులోకి తెచ్చారు.ప్రతి పరీక్ష కేంద్రం ఆవరణలో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. డీఈవో బ్రహ్మాజీరావుతో పాటు అన్ని మండలాల ఎంఈవోలు ఆదివారం పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జిల్లాలో 11,766 మంది విద్యార్థినీవిద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. వీరిలో 11,564 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 202 మంది ప్రైవేట్ విద్యార్థులు. వారందరికీ ఆయా పాఠశాలల్లో హాల్‌టికెట్లను ముందుగానే పంపిణీ చేశారు. పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఇన్విజిలేటర్లను నియమించారు. 22 పోలీస్‌స్టేషన్లను స్టోరేజీ పాయింట్లగా ఎంపిక చేసి పరీక్ష పేపర్లను భద్రపరిచారు. 10 రూట్‌లను ఏర్పాటు చేసి నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పాటు 71మంది చీఫ్ సూపరింటెండెంట్లు,71మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు 20 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుకు కలెక్టర్ దినేష్‌కుమార్ చర్యలు తీసుకున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
జిల్లాలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.కలెక్టర్ దినేష్‌కుమార్ జిల్లాలోని పాడేరు,గోకవరం ఆర్టీసీ డిపోల యాజమాన్యాలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రాల్లోని ఆశ్రమ పాఠశాలలు,గురుకుల విద్యాలయాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టెన్త్ విద్యార్థులు తమ హాల్‌టికెట్టును చూపిస్తే అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
చీఫ్ సూపరింటెండెంట్లు 71 మంది
డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు 71 మంది
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 04
పరీక్ష కేంద్రాలు 71
ఎ కేటగిరీ కేంద్రాలు 23
బి కేటగిరీ కేంద్రాలు 38
సి కేటగిరీ కేంద్రాలు 10
సమస్యాత్మక కేంద్రాలు 20
విజయీభవ