మహారాణిపేట(విశాఖ దక్షిణ): కేజీహెచ్‌కు వచ్చే రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను కలెక్టర్ ఎ.మల్లికార్జున హెచ్చరించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆస్పత్రి అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ హాజరై కేజీహెచ్ అభివృద్ధికి సంబంధించి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా పలు విభాగాధిపతులతో కలెక్టర్ సమావేశమయ్యారు. విభాగాధిపతు లు తమకు కావాల్సిన మౌలిక వసతులు, మెడికల్ సామగ్రి వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కమిటీకి వివరించి, పూర్తి చేసిన పనుల వివరాలు తెలిపారు. శుక్రవారం జరిగిన కమిటీ సమావేశంలో 15 పనులకు సుమరు రూ.1.10 కోట్లు, వైద్య పరికరాల నిమిత్తం రూ.కోటి వరకు కలెక్టర్ మల్లికార్జున ఆమోదం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ కేజీహెచ్‌లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ కేజీహెచ్‌కు వచ్చే రోగులు చాలా నిరుపేదలని, అత్యవసర సమయాలలో సాధ్యమైనంతగా మంచి వైద్యం అందించి ఆదుకోవాలన్నారు.