ఆదిలాబాద్: సీఎం కప్ రెండో ఎడిషన్ పోటీల్లో అన్ని అంశాల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ జట్టు చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం వేదికగా జరిగిన వేడుకలో జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చాంపియన్ ట్రోఫీ అందజేశారు. టోర్నీ మొదలైనప్పటి నుంచి ప్రచారం, నిర్వహణ, పతకాల్లో ఆదిలాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు మంగళవారం డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు ట్రోఫీని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా పాఠశాల శిక్షకులు రాజు, కబీర్ దాస్, శ్రీధర్, కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


