ప్రచారంలో ‘సోషల్’ ట్రెండ్
వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు పోస్టింగ్ చేసేందుకు ప్రత్యేక టీంలు ఓటర్లను ఆకర్షించే యత్నాలు
కై లాస్‌నగర్: ఎన్నికల ప్రచారపంథా మారుతోంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి తాము ఏమి చేయాలనుకుంటున్నారో తెలిపి వారి మద్దతు కోరేవారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో సోషల్ మీడియాను ప్రధాన ప్రచారస్త్రాంగా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫాంలలో తమ రోజువారీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని నియమించుకుంటున్నారు. మరికొంత మంది ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక పాటలు రూపొందించుకొని ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రీల్స్ ద్వారా ఓటర్ల ఫోన్లకు వీడియో, ఆడియో రూపంలో సందేశం పంపిస్తున్నారు. నోటిఫికేషన్ ముందు నుంచే మొదలైన సోషల్ మీడియా ప్రచారం ఉపసంహరణ అనంతరం మరింత ముమ్మరం కానుంది.
అప్‌డేట్‌గా ఉండేలా..
ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ప్రచార ఆయుధంగా సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. నోటిఫికేషన్‌కు ముందు నుంచే తమ రోజువారీ కార్యక్రమాలను అందులో పోస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫొటో, వీడియో గ్రాఫర్లను ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా కాలనీ పెద్దలు, అధికారులను కలవడం, సామాజిక సేవ కార్యక్రమాలు వంటి వాటిని చిత్రీకరించేలా ఉదయం నుంచి రాత్రి వరకు తమ వెంటే ఉంచుకుంటున్నారు. ఆయా ఫొటోలు, వీడియాలతో ప్రత్యేక రీల్స్ రూపొందిస్తున్నారు. వాటికి ఆడియో, వీడియోల రూపంలో సిద్ధం చేసి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంలలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఇందుకోసం కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన యువతను ఏర్పాటుచేసుకున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రచారాన్ని హోరెత్తించే బాధ్యతలు వారికి అప్పగించారు. ఒక్కొక్కరికి రూ.20వేల నుంచి రూ.25వేల వేతనం చెల్లిస్తున్నారు.
వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్..
కౌన్సిలర్ ఆశావహులు ఎన్నికల ప్రచారం కోసమే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తున్నారు. అందులో కాలనీ పెద్దలు, వివిధ కుల, ప్రజా సంఘాల బాధ్యులు, విద్యావంతులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల నంబర్లను సేకరించి అందులో యాడ్ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల ఫొటోలతో కూడిన రీల్స్‌ను సిద్ధం చేస్తూ వాటిని ఆయా గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. కౌన్సిలర్‌గా తమను ఆదరించి గెలపించాలని, ఎన్నుకుంటే తాము చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను అందులో వివరిస్తూ వీడియోలు పెడుతున్నారు. ప్రస్తుతం పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇలాంటి గ్రూపులే దర్శనమిస్తున్నాయి.


