నేటి నుంచి ప్రాక్టికల్స్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రాక్టికల్స్‌

Feb 2 2026 7:29 AM | Updated on Feb 2 2026 7:29 AM

నేటి నుంచి ప్రాక్టికల్స్‌

నేటి నుంచి ప్రాక్టికల్స్‌

నిఘా నీడలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ఈ నెల 11 వరకు నిర్వహణ 29 కేంద్రాల్లో ‘జనరల్‌’.. 11 కేంద్రాల్లో ‘ఒకేషనల్‌’ హాజరుకానున్న 8,041 మంది విద్యార్థులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రయోగ పరీక్షలు సోమవారం నుంచి షురూ కానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ సారి ఈ ప్రాక్టికల్స్‌ నిఘా నీడలో జరగనున్నాయి. 11వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 8,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.

జిల్లాలో..

జిల్లాలో 40 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి సీసీ నిఘాలో నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. దీంతో అధికారులు ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాలుగు ల్యాబ్‌లతో పాటు వరండా, పరీక్షకు సంబంధించిన మార్కులు ఆన్‌లైన్‌లో పొందుపరిచే గదిలో వాటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 13 ప్రభుత్వ, 18 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలతో పాటు రెండు ట్రైబల్‌ వెల్ఫేర్‌, మూడు కేజీబీవీలను జనరల్‌ విద్యార్థుల కోసం కేంద్రాలను కేటాయించారు. ఇందులో నాలుగు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రాల్లో ఒకేషనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌, కేజీబీవీల్లో ఒకేషనల్‌ విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. సాంఘిక సంక్షేమ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, మైనార్టీ, బీసీ, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీలకు సంబంధించిన విద్యార్థులు వారి కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. జనరల్‌ విద్యార్థుల కోసం 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో బైపీసీ విద్యార్థులు 3,475 మంది, ఎంపీసీ విద్యార్థులు 2,673 కలిపి 6,148 మంది హాజరు కానున్నారు. ఒకేషనల్‌ విద్యార్థులు 1,893 మంది 11 కేంద్రాల్లో హాజరు కానున్నారు. మొత్తం 8,041 మంది పరీక్షలు రాయనున్నారు.

రెండు విడతల్లో

ఈ ప్రాక్టికల్స్‌ పరీక్షలు రెండు విడతల్లో కొనసాగనున్నాయి. ఈనెల 2 నుంచి 6 వరకు మొదటి విడత, 7 నుంచి 11వరకు రెండో విడత నిర్వహించనున్నారు. రెసిడెన్షియల్‌, కేజీబీవీల్లో చదివే విద్యార్థుల కోసం బాలికల జూనియర్‌ కళాశాలల్లో,బాలుర కో సం ప్రభుత్వ బాలుర జూనియర్‌కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాపీయింగ్‌ జరగకుండా

ఈ పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే డీఈసీ మెంబర్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. అబ్జర్వర్లుగా ఇతర కళాశాలలకు చెందిన లెక్చరర్లు వ్యవహరించనున్నారు. సీసీ కెమెరాలను ఇంటర్మీడియెట్‌ బోర్డుతో పాటు డీఐఈవో కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు అధికారులు వివరించారు.

పకడ్బందీగా నిర్వహిస్తాం

ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహిస్తాం. నిర్ణీత సమయానికి పరీక్షలు ప్రారంభించాలి. లెక్చరర్లు వాల్యూయేషన్‌ను నిస్పక్షపాతంగా చేపట్టాలి. ఈనెల 11 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆయా కేంద్రాల నిర్వాహకులు ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలు నిర్వహించాలి. ఎగ్జామినర్లకు వచ్చిన ఓటీపీని ఇతరులకు పంపవద్దు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే 08732–297115 నంబర్‌లో సంప్రదించాలి. విద్యార్థులు ఆయా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలి. పరీక్షలు సజావుగా జరిగేలా సహకరించాలి.

– జాదవ్‌ గణేశ్‌కుమార్‌, డీఐఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement