ఖరారైన కాంగ్రెస్ అభ్యర్థులు
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా ఖరారైంది. వార్డుల వారీగా ఎంపిక చేసిన వారి పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రా ష్ట్రంలో హస్తం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐతో ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనుంది. పట్టణంలోని రెండు వార్డులను కేటాయించాలని సీపీఐ కోరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేష న్ కూడా దాఖలు చేశారు. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి ఒక సీటును కాంగ్రెస్ కేటాయించన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నాయకత్వానికి సైతం ఈ విషయాన్ని హస్తం నేతలు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో ఇటీవల పలుమార్లు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ టికెట్లను ఆశిస్తూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థిత్వం దక్కనటువంటి వారితో నామినేషన్లను ఉపసంహరించుకునే దిశగా పార్టీ ముఖ్యనేతలు చర్చలు ప్రారంభించారు. పార్టీకి ఇబ్బంది కలుగకుండా ఉండేలా బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో వార్డు నుంచి ఐదుగురికి మించి నామినేషన్లు వేయడంతో టికెట్ రాని వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందని భావిస్తున్నారు. అలాంటి వారితో పార్టీకి ఏమాత్రం నష్టం కలుగకుండా వారిని తమ దారిలోకి తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై జిల్లా పార్టీ ముఖ్యనేతలందరితో చర్చించి వారి అభిప్రాయలను స్వీకరించారు. వా టన్నింటిని పరిగణలోకి తీసుకుని పాత, కొత్త కలయికతో అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. టికెట్ దక్కనటువంటి వారితో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాల్సిన బాధ్యతలను సైతం పార్టీ నేతలకే అప్పగించినట్లుగా సమాచారం. నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు గడువే ఉండటం, ప్రచార పర్వం షురూ కానున్న నేపథ్యంలో అభ్యర్థుల వివరాలను సోమవారం అధికారికంగా ప్రకటిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు.


