‘మున్సిపల్’లో విజిలెన్స్ తనిఖీలు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ విభాగం కరీంనగర్ ఇన్‌స్పెక్టర్ సంతో షం రవీందర్, తహసీల్దార్ దినేశ్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఆరుగురు అధికారులతో కూడిన బృందం సుదీర్ఘంగా పరిశీలన జరిపింది. తొలుత మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజును మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం గ్రూపులుగా విడిపోయిన అధి కారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఎస్టాబ్లిష్ మెంట్, రెవెన్యూ, అకౌంట్స్ విభాగాలతో పాటు స్టోర్‌రూంను సైతం పరిశీలించారు. ఆయా విభాగాల్లో చేపట్టిన పనులు, చేసిన కొనుగోళ్లు, చెల్లించిన బిల్లులు, నిధుల వ్యయం వంటి అంశాలపై ఆరా తీశారు. సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించా రు. ఆయా విభాగాధిపతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11.30గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 7గంటల వరకు కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ తనిఖీలతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోననే ఆందోళన పలువురిలో కనిపించడం గమనార్హం. విచారణ నివేదికను రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఈ)కి అందజేస్తామని ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. వారి వెంట సాయిరాం,కె.శ్రీనివాస్, తదితరులున్నారు.
‘సాక్షి’ కథనాల ఆధారంగా..
ఆదిలాబాద్ మున్సిపల్‌లోని ఆయా విభాగాల్లో అక్రమాలను వివరిస్తూ ‘సాక్షి’లో ఇటీవల పలు వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ చూపుతూ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. పట్టణంలోని విద్యుత్ దీపాల నిర్వహణకు సంబంధించి రూ.1.26 కోట్లతో చేపట్టిన టెండర్లలో తప్పిదాలు, లాండసాంగ్వి పంప్‌హౌస్ వద్ద చేపట్టిన పనులు, టెండర్లలో అక్రమాలు, అలాగే టెండర్లు లేకుండానే బ్లీచింగ్ పౌడర్, రెయిన్ కోట్లు కొనుగోళ్లు, సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆలస్యంగా పనులు చేపట్టి, బిల్లులు స్వాహా చేసిన వైనం, హరితహారం అమల్లో లోపాలు, అక్రమ లేఅవుట్ల దందా వంటి విభాగాల్లో అక్రమాలను ‘సాక్షి’ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అలాగే కార్మికులు పనిచేయకున్నా చేసినట్లుగా చూపించడంపై కూడా ఆరా తీసినట్లుగా సమాచారం. కాగా, కార్యాలయంలో అందించిన నివేదికలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకపోవడంతో తన బాగోతం బయటపడి ఎలాంటి చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందనే దానిపై ఆందోళనకు గురైన ఓ అధికారి కవరేజీ కోసం వెళ్లిన విలేకరులపై తన అక్కసు వెల్లగక్కడం గమనార్హం. పరుష పదజాలంతో దూషిస్తూ ‘గెటౌట్ ఫ్రం మై ఆఫీస్’ అంటూ హెచ్చరించడం చర్చనీయాంఽశంగా మారింది. మీడియా ప్రతినిధులపైనే నోరు పారేసుకున్న సదరు అధికారి ఇక సామాన్యులకు ఎలాంటి సేవలందిస్తారనే దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


