నామినేటెడ్ వచ్చేనా..!?
మరోసారి అధికార కాంగ్రెస్‌లో చర్చ త్వరలో వివిధ పదవుల పందేరమనే ప్రచారం ముఖ్యనేతల పేర్లపై అధిష్టానం పరిశీలన
సాక్షి, ఆదిలాబాద్: అధికార కాంగ్రెస్‌లో మరోసారి నామినేటెడ్ పదవులపై చర్చ మొదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జిల్లాలోని పలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇప్పుడు.. అప్పుడు అంటూ అధిష్టానం దాటవేసుకుంటూ రావడంతో ముఖ్యనేతలు, కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలు సాధించామని పార్టీ ముఖ్య నేతలు ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఇకనైనా ఈ పదవులను భర్తీచేస్తే పార్టీ బలోపేతానికి దోహదపడినట్లవుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంబరమే తప్పితే ముఖ్య పదవుల పరంగా అందని ద్రాక్షలాగా పదేపదే వాయిదా పడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కష్టపడి పనిచేసే నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడుతుందన్న అభిప్రాయం వారిలో లేకపోలేదు. జిల్లా స్థాయిలో పలు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిపై దృష్టి సారించకపోవడంపై నిరుత్సాహం వ్యక్తమవుతోంది. జిల్లాస్థాయిలో పార్టీ పరంగా రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నేతలు లేకపోవడంతో ఈ దుస్థితి ఉందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది.
ఈ సారైన భర్తీ అయ్యేనా..
ఆదిలాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఔడా)ని ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా ఆ చైర్మన్ పదవీ ఎవరికి కేటాయించకపోవడంతో అసలు ఆ అథారిటీ ఎందుకు ఏర్పాటు చేశారు.. ఆ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు సరైన దశలో లేకపోవడంపై చర్చ సాగుతోంది. చైర్మన్‌ను నియమించి వ్యవస్థను అందుబాటులోకి తేవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఉట్నూర్ ఐటీడీఏకు సంబంధించి ఆదిమ గిరిజన సంక్షేమ సలహా మండలి (ఏటీడబ్ల్యూఏసీ) చైర్మన్‌ను నియమించాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉందని చెప్పుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించిన సమయంలో ఎంపీ గోడం నగేశ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సీఎం కూడా త్వరలోనే ఈ పదవీని భర్తీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ పదవీ ఎవరికి దక్కుతుందా ..అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చ సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఓ ముఖ్యనేతకు ఈ పదవీ ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతుంది. అలాగే పలు దేవాలయాలకు సంబంధించిన పాలకమండళ్లను సైతం నియమించాలని, పార్టీలో నేతలు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తే పార్టీ అభ్యున్నతికి పాటుపడే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్నారు.


