● పల్లె పాలనలో అత్యధికులు కొత్తవారే ● మెజార్టీ గ్రామాల్
జిల్లాలో..
మొత్తం గ్రామ పంచాయతీలు : 473
ఇందులో తొలిసారి సర్పంచ్‌గా
ఎన్నికై న వారు : 385
కై లాస్‌నగర్: పల్లెపోరు ముగిసింది. మరో రెండు రోజుల్లో కొత్త పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. నూతన సర్పంచ్‌ల పాలన అందుబాటులోకి రానుంది. అయితే ఈ సారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే. పాలన అనుభవం, రాజకీయ నేపథ్యం లేని వారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని వీరు అనేక హామీలిచ్చారు. అయితే ప్రస్తుతం గ్రామాల్లో సమస్యలు పేరుకుపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల నుంచి నిధులు విడుదల నిలిచిపోవడంతో వీరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఏ విధంగా పాలన సాగిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వీరికి పల్లెపాలన సవాల్‌గా మారనుంది.
నిలిచిన నిధుల విడుదల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం (ఎఫ్‌ఎఫ్‌సీ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ ఎఫ్‌సీ)నిధులను గ్రామాల్లోని జనాభా దామాషా ప్రకారం కేటాయిస్తుంది. అయితే పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఈ నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీల ఖజానాలు నిండుకున్నాయి. నయాపైసా లేకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి. అత్యవసర పనులకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన దుస్థితి.
సమస్యలు స్వాగతం..
జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలకనున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని దుస్థితి. ట్రాక్టర్ కిస్తీలు సైతం రెండేళ్లుగా చెల్లించడం లేదు. నెలల తరబడి పేరుకుపోవడంతో వాటికి బ్యాంకులు అదనంగా వడ్డీలు వేస్తున్నాయి. వీటితో పాటు కరెంట్ బిల్లులు సైతం పెను భారంగా మారాయి. డీజిల్‌కు సైతం డబ్బుల్లేక పలు జీపీల్లో ట్రాక్టర్లు మూలనపడి ఉన్నాయి. ఇక నీటి సరఫరాకు సంబంధించి మోటార్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన డ్రెయినేజీలను శుభ్రం చేయలేని పరిస్థితి ఉంది. ఇలా పలు సమస్యలతో పంచాయతీలు సతమతమవుతున్నాయి. వీటిని పరిష్కరించడం కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారనుంది. అలాగే ఎన్నికల సందర్భంగా ఆలయాలు, లైబ్రరీలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించి ఇస్తామని, పంట చేలకు రోడ్లు వేయిస్తామని, గ్రామంలో అన్ని చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీలిచ్చారు. నిధుల కొరతతో చిన్నపాటి సమస్యలే పరిష్కరించలేని పరిస్థితి ఉండగా హామీల అమలు వారికి కత్తిమీద సాముగానే మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం
పరేషాన్‌లో కార్యదర్శులు..
ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులే అన్నీ తామై వ్యవహరించారు. ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల నిలిచిపోవడంతో గ్రామాల్లో అత్యవసర పనులకు వారే తమ జేబుల్లో నుంచి వెచ్చించారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా కొత్త పాలకవర్గాలు రానుండటంతో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలవుతాయని భావిస్తున్నారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు పెండింగ్ బిల్లులను తమకు చెల్లిస్తారా లేదా అనే దానిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు అడ్డుపడితే తమ పరిస్థితేంటనే దానిపై మదనపడుతున్నారు.


