హెచ్‌పీవీతో క్యాన్సర్‌కు చెక్
ఆదిలాబాద్‌టౌన్: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిల్లోమ వైరస్ (హెచ్‌పీవీ) టీకా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2026 జనవరి మొదటి వారంలో వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతుంది. చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతూ తనువు చాలిస్తున్నారు. బాధితుల్లో 50 శాతం వరకు మృత్యువాత పడుతున్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. మొదట్లోనే నివారించేందుకు ఈ టీకా దోహద పడనున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.4వేల నుంచి రూ.10వేల వరకు ఉండడంతో పేదలకు అందడం లేదు. విషయాన్ని గమనించిన ప్రభుత్వాలు కిశోర బాలికలకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వైద్యాధికారులు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తిచేశారు.
క్యాన్సర్‌ను అరికట్టేందుకు..
వచ్చేనెల మొదటి వారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14ఏళ్లు నిండిన కిశోర బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. ఈ వ్యాక్సిన్‌తో గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రాకుండా దోహద పడుతుంది. దీంతో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని వైద్యాధికారులు చెబుతున్నారు. హెచ్‌పీవీ–16, హెచ్‌పీవీ–18 అనేవి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు. ఇవి గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తాయి. బాధితుల్లో 50 శాతం మంది మృత్యువాత పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 47 మంది బాధితులు..
జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్‌తో 47 మంది బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగే వివిధ రకాల క్యాన్సర్‌తో 103 మంది బాధితులు ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. అనధికారికంగా వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. కిశోర బాలికలకు హెచ్‌పీవీ టీకా ఒకే డోస్ వేయనున్నారు. ఈమేరకు ఆయా గ్రామాల్లో ఆశ కార్యకర్తల ద్వారా సర్వే చేసి వివరాలు సేకరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 11,730 మంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించారు. వీరు 9,10 తరగతులు చదువుతున్నారు. అన్ని పీహెచ్‌సీలతో పాటు రిమ్స్‌లోని పీపీ యూనిట్‌లో ఈ వ్యాక్సిన్ వేయనున్నారు.
ఏర్పాట్లు చేస్తున్నాం..
వచ్చే నెల మొదటి వారంలో కిశోర బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. జిల్లాలో 14ఏళ్లు నిండిన కిశోరబాలికలు 11,730 మంది ఉన్నారు. హెచ్‌పీవీతో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా అరికట్టవచ్చు. దీంతో ఎలాంటి ప్రమాదం లేదు.
– వైసీ శ్రీనివాస్,
జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి


