విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ఆదిలాబాద్‌టౌన్: నూతన ఆవిష్కరణలు రూపొందిస్తూ విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో శుక్రవారం ఇన్‌స్పైర్ మేళా, జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను తిలకించి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రయోగం వైపు తీసుకెళ్లాలని సూచించారు. వారిలో ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికి తీయాలని పేర్కొన్నారు. సైన్స్ నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఆరె భాస్కర్, ఎంఈవో సోమయ్య, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి రఘురమణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, విద్యాశాఖ ఏడీ వేణుగోపాల్ గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణకుమార్, శ్రీనివాస్, అశోక్, రవీంద్ర, దినేష్ చౌహాన్, గోపీకృష్ణ, సతీశ్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


