ఆ పనులకు మళ్లీ ప్రతిపాదనలు
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం రాష్ట్రప్రభుత్వం ఇటీవల రూ.18.70 కోట్లను రెండు విడతలుగా విడుదల చేసిన విష యం తెలిసిందే. పట్టణంలో విలీనమైన వార్డులతో పాటు పాతవార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు సంబంధించి వీటిని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు టెండర్లు నిర్వహించి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఇది వరకు చేసిన ప్రతిపాదిత కేటాయింపులు కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రజాభిప్రాయం స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను నియమించారు.
గతంలో వార్డుల వారీగా కేటాయింపులు ఇలా...
మున్సిపల్ కౌన్సిల్ గడువు ముగిసిన ఏడాది తర్వా త ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేస్తూ అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పట్టణంలోని అన్నివార్డుల్లో అవసరమైన సీసీ రో డ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టేందు కోసం మున్సిపల్ అధికారులు ఇదివరకే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రాధాన్యత క్రమంగా నిధుల కేటా యింపులు చేశారు. విలీన కాలనీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఇందులో అత్యధికంగా ఎంప్లాయీస్ కాలనీకి రూ.85లక్షలు, బంగారుగూడకు రూ.60లక్షలు, వాల్మీకి, ఆర్‌ఆర్ నగర్, వికలాంగుల కాలనీలు మూడింటికి గాను రూ.90లక్షలు, కేఆర్‌కేలోని 7,8 రెండు కాలనీలకు రూ.65లక్షలు, రాంనగర్‌లో రూ.20లక్షలు, న్యూహౌసింగ్‌బోర్డు, భాగవతినగర్, ‘170’ కాలనీలకు రూ.90లక్షలు కేటాయించారు. రణదీవేనగర్, రాంపూర్‌కు రూ.45లక్షల చొప్పున, టీచర్స్‌కాలనీకి రూ.50లక్షలు, దుర్గానగర్, దస్నాపూర్, సోనర్‌గల్లీకి రూ.40లక్షల చొప్పున, గాంధీనగర్, వరలక్ష్మినగర్‌కు రూ.35లక్షలను కేటాయించారు. ఈ పనులకు ఇక టెండర్లు నిర్వహించడమే తరువాయి అని అంతా భావించారు. అయితే బల్ది యా అధికారులు ఈ కేటాయింపులను పరిగణలోకి తీసుకోకుండా తాజాగా విడుదలైన రూ.3.70కోట్లు కలిపి మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
ప్రజాభిప్రాయ స్వీకరణ ...
రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు గాను మళ్లీ ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు బల్దియా అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పట్టణంలోని అన్ని వార్డుల్లో క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా స్థానికుల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు. డీఈ, ఏఈ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌తో కూడిన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చే శారు. రెండు టీంల్లో డీఈలు కీలకంగా ఉండగా, మరోటీంలో మున్సిపల్ ఇంజినీర్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందాలు ఈనెల 17 నుంచి 22 వ రకు తమకు కేటాయించిన వార్డుల్లో పర్యటిస్తాయి. అక్కడి కాలనీ పెద్దలు, ప్రజలను కలిసి ఎలాంటి పనులు ముందుగా చేపట్టాలి.. ఏయే ఇబ్బందులు న్నాయనే దానిపై వివరాలు అడిగి తెలుసుకుంటా రు. సమస్యల ఆధారంగా చేపట్టాల్సిన పనుల ను నిర్ణయించి వాటితో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. వాటికి ఆమోదం లభించిన వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ మొక్కుబడిగా కాకుండా పారదర్శకంగా చేపడితే ఆయా కాలనీల్లో కొంతమేర ఇబ్బందులు దూరమయ్యే అవకాశముంటుంది.
కలెక్టర్ ఆదేశాల మేరకే..
పట్టణంలోని ఆయా కాలనీల్లో ప్రజల సమస్యలు స్వయంగా పరిశీలించి, వాటికనుగుణంగా పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు సోమవారం నుంచి మూడు బృందాలు కేటాయించిన వార్డులకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. వాటికి అనుగుణంగా నిధుల కేటాయింపు చేసి కలెక్టర్ ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం కోసం పంపిస్తాం. అనంతరం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తాం.
– పేరిరాజు, మున్సిపల్ ఇంజినీర్


