పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలి
కైలాస్‌నగర్: పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొ డ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ప్రధానోపాధ్యాయులు, ఏంఈవోలు సూచించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్‌లో ఉన్న చోట్ల వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎంశ్రీ సమీక్షలో భాగంగా ఈ నెల 21న రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. బోథ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పాఠశాల స్వచ్ఛత, భద్రత, మౌలిక వసతుల స్థితిపై సమగ్ర పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో ఎస్.రాజేశ్వర్, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల గోడౌన్ తనిఖీ
జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ శనివారం పరిశీలించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచపూల తదితరులున్నారు.


