 
															బడులకు రేటింగ్
జిల్లాలో 15 పాఠశాలలకు 5స్టార్ ఎనిమిది స్కూళ్లను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపేందుకు కసరత్తు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న బృందాలు
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై జిల్లాలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ్ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్‌లు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కస్తూర్భా, గురుకులాల మౌలిక వసతుల వివరాలు అప్‌లోడ్ చేయడంతో వాటికి రేటింగ్ ఇచ్చారు. అప్‌లోడ్ చేసిన వివరాలు సరైనవేనా అనే దానిపై కమిటీ సభ్యులు బడులకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం వరకు కొనసాగుతుంది.
5స్టార్‌కు ఎంపికైన పాఠశాలలివే..
జిల్లాలో 1,454 పాఠశాలలు ఎస్‌హెచ్‌వీఆర్‌లో పాల్గొన్నాయి. వీటి వివరాలతో సెప్టెంబర్ 1నుంచి అక్టోబర్ 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశా రు. ఆరు అంశాలకు సంబంధించిన ఫొటోలు అప్ లోడ్ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, చేతుల శు భ్రత తదితరాలపై వివరాలు నమోదు చేశారు. అ యితే 1,143 పాఠశాలలకు సంబంధించి మాత్రమే ఫొటోలు అప్‌లోడ్ చేయగా 15 బడులకు 5స్టార్ రేటింగ్ లభించింది. ఎంపికై న వాటిలో ఆదిలాబాద్ పట్టణంలోని నలంద జూనియర్ కళాశాల, మావలలోని ఎంజేపీ బాలికల జూనియర్ కళాశాల, ఇచ్చోడలోని బీపీఆర్ పబ్లిక్ స్కూల్, యాపల్‌గూడ మండల పరిషత్ పాఠశాల, మావలలోని ఎంజేపీ బాలికల పాఠశాల, కోకస్‌మన్నూర్ ప్రాథమిక పాఠశాల, మావలలోని చావర అకాడమీ, జైనథ్ మోడల్ స్కూల్, బజార్‌హత్నూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్, ఝరి ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, ఉట్నూర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ వికాసం పాఠశాల, కన్గుట్ట జెడ్పీహెచ్‌ఎస్, చాంద ప్రాథమిక పాఠశాల, యూపీఎస్ ఓల్డ్ బస్టాండ్ ప్రభుత్వ పాఠశాల, హస్నాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలకు 5స్టార్ రేటింగ్ వచ్చింది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
4స్టార్, 5 స్టార్ వచ్చిన పాఠశాలలను ప్రధానోపాధ్యాయుల బృందం పర్యవేక్షిస్తోంది. నమోదు చేసి న వివరాలు సరైనవా.. కాదా.. అనే దానిపై ఆరా తీస్తారు. 5స్టార్ వచ్చినా అక్కడ వసతులు సక్రమంగా లేకపోతే వాటిని రద్దు చేస్తారు. 4స్టార్ పాఠశాలల్లో వసతులు బాగుంటే 5స్టార్‌కు కూడా ఎంపిక చే యనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలను మూడు రోజుల పాటు దేశ వ్యాప్త విహారయాత్రకు తీసుకెళ్తారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఈ నిధులు వినియోగించవచ్చు. జిల్లాలో 5స్టార్‌కు ఎంపికై న 15 పాఠశాలల నుంచి ఉత్తమంగా ఉన్న ఎనిమిదింటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
రేటింగ్ ఎంపికై న స్కూళ్లు
5స్టార్ 15
4స్టార్ 189
3స్టార్ 495
2స్టార్ 254
1స్టార్ 190
మొత్తం 1,143

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
