గుడ్‌విల్‌తో ఎర
వైన్స్‌లను దక్కించుకోవడమే లక్ష్యం రంగంలోకి లిక్కర్ వ్యాపారులు మొదలైన బేరసారాలు బడాబాబులకు దక్కిన కొన్ని షాపులు మిగతా వాటిని కై వసం చేసుకునే యత్నాలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అన్ని వైన్స్‌లది ఒక ఎత్తయితే.. ఆదిలాబాద్ పట్టణంలో లిక్కర్ వ్యాపారం మరో ఎత్తు.. టౌన్‌లోని షాపులన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవాలన్నది బడా, పాత లిక్కర్ వ్యాపారుల లక్ష్యం. సిండికేట్ ద్వారా మద్యం వ్యాపారాన్ని శాసించవచ్చనేది వారి ఆలోచన. ఈ వ్యాపారంలో తలపండిన వారికి ఈసారి లక్కీడ్రా కూడా కలిసి వచ్చింది. లిక్కర్ వ్యాపారం పేరెత్తగానే జిల్లా కేంద్రంలో గుర్తుకు వచ్చే ఓ ప్రధాన వ్యాపారికి పట్టణంలో ఏకంగా మూడు షాపులు దక్కాయి. ఇదే వ్యాపారంలో ఉన్న అతడి సోదరుడికి ఓ షాపు దక్కింది. గతం నుంచి మద్యం వ్యాపారంలో ఉన్న మరో గ్రూప్‌నకు చెందిన ఒకరికి ఓ షాపు దక్కింది. ఇతర వ్యాపారంలో ఉన్న ఓ వ్యక్తికి ఇంకో షాపు దక్కింది. పది షాపుల్లో ఈ ఆరు ఒకరితో ఒకరికి పరిచయాలు, బంధుత్వాలు ఉన్నవారే. వీరంతా కలిసి సిండికేట్‌కు అడుగులు వేసే పరిస్థితి లేకపోలేదు. ఇక మిగిలినవి నాలుగు షాపులే.. ఈ నాలుగు మద్యం వ్యాపారంతో అంతగా సంబంధం లేని వ్యక్తులకు వచ్చాయి. ఇప్పుడు వాటిపైనే బడాబాబుల దృష్టి పడింది. గుడ్ విల్ ద్వారా ఆ దుకాణాలను చేజిక్కించుకుని మద్యం వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళిక మొదలైంది.
జోరుగా ప్రయత్నాలు..
వైన్స్ టెండర్లు ముగిశాయి. లక్కీడ్రాలో జిల్లాలోని 40 షాపులకు గాను 34 షాపుల ఎంపిక పూర్తయింది. మరో ఆరు షాపులకు దరఖాస్తులు తక్కువగా రావడంతో రీటెండర్‌కు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. జిల్లాలో మద్యం వ్యాపారపరంగా ఆదిలాబాద్ పట్టణంపై అందరి దృష్టి ఉంటుంది. ఇక్కడున్న పది షాపుల యజమానులు ఒక్కటైతే సిండికేట్‌గా మార్గం సులువవుతుంది. తద్వారా చీప్ లిక్కర్ విక్రయాలను బెల్టుషాపుల ద్వారా జోరుగా నడిపేందుకు ఆస్కారముంటుంది. ఈ వ్యాపారంలో తలపండిన వారికి ఈ సిండికేట్, బెల్టుషాపులకు లిక్కర్ సరఫరా వంటి అంశాలు పిండితో కొట్టినట్టివి. తమకు దక్కిన షాపులతో పాటు ఇతర షాపులను పొందడం ద్వారా పట్టణంలో లిక్కర్ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు జోరుగా ప్రయత్నాలు మొదలయ్యాయి.
రూ.50లక్షల నుంచి రూ.65లక్షల వరకు..
టెండర్లు ముగియడం, లక్కీ డ్రా ద్వారా షాపులు ఎవరెవరికి వచ్చాయనేది తెలియడం, నూతన మద్యం పాలసీ ప్రారంభానికి మరో నెల రోజులపైబడి సమయం ఉండటంతో బడాబాబులు మిగిలిన వైన్స్‌షాపులను గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. లక్కీ డ్రాలో షాపు పొందినప్పటికీ వ్యాపారంపై అంత అవగాహన లేకపోవడంతో వారు కూడా ఎవరైన తలపండిన వ్యాపారులు మంచి గుడ్‌విల్ ఇస్తే తమ షాపును అప్పగించేద్దామనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని షాపులను దక్కించుకున్న బడాబాబులు ఇలాంటి వారిపై దృష్టి సారించి గుడ్‌విల్‌తో ఎర వేస్తున్నారు. రూ.50లక్షల నుంచి రూ.65లక్షల వరకు బేరసారాలు నడుస్తున్నాయి. లక్కీ పర్సన్‌ల అంచనాలు మరో రకంగా ఉండటంతో ఈ బేరసారాలకు కొద్ది రోజులు పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ షాపు దక్కిన వారు సుమా రు కోటి గుడ్‌విల్ ఆశిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో గుడ్‌విల్ ఎర ఎంతవరకు ఉంటుందనేది వేచిచూడాల్సిందే.


