
చిన్నారుల ఆలనా.. పాలన
ఆదిలాబాద్‌టౌన్: చిన్నారుల ఆలన పాలన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభు త్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు కూలీనాలి చేసే త ల్లుల పిల్లల పాలన కోసం ‘పల్నా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో జిల్లాలో అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు వివిధ పనులకు వెళి తే వారి పిల్లల సంరక్షణకు చర్యలు చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేంద్రాల్లో పోషకాహారంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించనున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఈ కేంద్రాలను అంగన్‌వాడీ సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నియోజకవర్గానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసే అవకాశం ఉందని మహిళా, శిశు సంక్షేమ శా ఖాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పిల్లల సంరక్షణ కోసం..
ఆదిలాబాద్‌తో పాటు ఆయా మండలకేంద్రాలు, గ్రామాల్లో చాలా మంది మహిళలు వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. అయి తే కొంతమంది వారి పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతో పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో అక్క డ పూర్తిస్థాయిలో పనులు చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం పిల్లల సంరక్షణ కోసం ఏం చేయాలో తెలియక ఎవరో ఒకరు ఇంటివద్దే ఉండాల్సిన పరి స్థితి ఉంది. అయితే కేంద్రం తీసుకువస్తున్న పల్నా కేంద్రాలతో ఇబ్బందులు కొంత తొలగనున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో 6 కేంద్రాలను, నార్నూర్‌లో 1, ఇచ్చోడలో 2, ఉట్నూర్‌లో 1 కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
చదువుతో పాటు ఆటపాటలు..
ఈ పల్నా కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల వరకు ఇందులో వదిలివెళ్లొచ్చు. అయితే తప్పనిసరిగా తల్లులు ఏదో ఒక ఉద్యోగం, కూలీ పనులు చేసేవారై ఉండాలి. అలాంటి తల్లుల పిల్లల కోసమే ఇక్కడ సౌకర్యం కల్పిస్తారు. ఈ కేంద్రంలో ఒక టీచర్‌తో పాటు ఒక ఆయాను నియమిస్తారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ 3 నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు మాత్రమే ఆటపాటలతో చదువు నేర్పిస్తారు. అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకోరు. అయితే ఈ కేంద్రాల అనుబంధంగానే ఇవి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 1,287 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఆరేళ్లలోపు 22వేల మంది చిన్నారులకు చదువుతో పాటు పోషకాహారం అందిస్తున్నారు. 1,110 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తుండగా, 177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పల్నా కేంద్రాలకు సంబంధించిన సరుకులు, ఇతర వస్తువులు, ఉద్యోగుల వేతనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిధులను అందజేయనున్నాయి. పగటిపూట చిన్నారులను పడుకోబెట్టడం, ఆటలాడించడం, విద్యాబోధనతో పాటు పోషకాహారం అందించనున్నారు.
పల్నా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు..
జిల్లాలో పల్నా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నియోజకవర్గానికి ఐదు చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ కేంద్రాల్లో వర్కింగ్ ఉమెన్ పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు, పోషకాహారం అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇంకా రావాల్సి ఉన్నాయి.
– మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి, ఆదిలాబాద్