
● ఇప్పటివరకు జారీ కాని గైడ్‌లైన్స్ ● అమలైతే రైతులకు ప్
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్) అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఆదిలాబాద్ మార్కెట్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా ఈ సీజన్ నుంచే అమలు చేయనున్నట్లు స్వ యంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నా గేశ్వర్‌రావు గతంలో ప్రకటించారు. అయితే.. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి విధివిధానాలు ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. దీంతో ఈ పథకం అమలవుతుందో.. లేదో.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం అమలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోననే సందిగ్ధం రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ అధికారుల్లో నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధంగా లేమని కేంద్రానికి స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో పీడీపీఎస్ అమలు ప్రశ్నార్థకం కాగా, ఎక్కడ అమలవుతుందోనని ఆందోళన చెందుతున్న ఆయా వర్గాలకు ఊరట లభించనట్లయింది.
ఇదీ.. పథకం ఉద్దేశం
ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ప్రకా రం భారత పత్తి సంస్థ (సీసీఐ) మార్కెట్‌లో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయదు. వ్యాపారులు మా త్రమే రైతుల పత్తి కొనుగోలు చేస్తారు. ప్రధానంగా మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే రైతులకు తక్కువ ధర లభించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుంది. సీసీఐ ద్వారా ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్‌లో ఎంఎస్పీ కంటే తక్కువ ధర ఉన్నప్పుడు రైతులకు ఆ వ్యత్యాసాన్ని చెల్లించడం ద్వారా వారికి నష్టం కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ భావన. కానీ.. జిల్లాలో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
కేంద్రంతో పలుసార్లు చర్చలు
ఈ విధానంపై గత సీజన్ చివరలోనే చర్చ మొదలైంది. అదే సమయంలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆదిలాబాద్ మార్కెట్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ పలుసార్లు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచింది. గత జూన్ 19న న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్‌లో ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. పీడీపీఎస్ అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లపై చర్చించారు. నీతి ఆయోగ్, సీసీఐ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల అధికారులు, కాటన్ అసోసియేషన్ సభ్యులు, ఎంపిక చేసిన రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి ఓ జిన్నింగ్ మిల్లు వ్యాపారి, రైతు సంఘం నాయకుడు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.

● ఇప్పటివరకు జారీ కాని గైడ్‌లైన్స్ ● అమలైతే రైతులకు ప్