
కళాశాలపై నిఘా
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ కళాశాలల అభివృద్ధిపై సర్కారు దృష్టి సారించింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు కళాశాలల్లో నిఘా ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలతో పర్యవేక్షణకు శ్రీకారం చుట్టింది. ఆయా కాలేజీల నుంచి నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనరేట్‌కు వీటిని అనుసంధానం చేశారు. తరగతులకు డుమ్మా కొట్టే విద్యార్థులు, సక్రమంగా విధులు నిర్వహించని గురువులకు చెక్ పడనుంది. ఈ ప్రక్రియ ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగనుండడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందనుంది. తద్వారా ఉత్తీర్ణత శాతం మెరుగుకానుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో..
జిల్లాలో ఒక్కో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 14 సీసీ కెమెరాల చొప్పున అమర్చారు. తరగతి గది, కళాశాల ముందు భాగం, ఆవరణలో వీటిని ఏర్పాటు చేశారు. విద్యార్థినులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా ఇట్టే తెలిసిపోనుంది. వీటి ఏర్పాటుతో బాలికలకు మరింత భరోసా కలగనుంది. అలాగే లెక్చరర్ల సమయపాలన తీరు తెలుస్తోంది. ఏ తరగతి కూడా లెక్చరర్ లేకుండా ఉండకూడదు. అలాగే ఒకరికి బదులు మరొకరు బోధించే పరిస్థితికి చెక్ పడనుంది. ఇక ప్రతీ విద్యార్థికి 75 హాజరు శాతం ఉంటేనే పరీక్షలకు అనుమతించనున్నారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం కూడా మెరుగుపడనుంది.
తరగతులు బోధించాల్సిందే..
జిల్లాలోని చాలా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇదివరకు కనీసం ప్రార్థన కూడా నిర్వహించని పరిస్థితి ఉండేది. ఇక ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అలాగే ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు బోధించాల్సిందే. దీనికి సంబంధించి టైంటేబుల్ సైతం సిద్ధం చేశారు. ప్రతీ గదిలో సీసీ కెమెరా ఏర్పాటు కారణంగా లెక్చరర్లు ఇక కాలక్షేపం చేయడానికి అవకాశం లేదు. అలాగే విద్యార్థులు సైతం తప్పనిసరిగా తరగతి గదిలో కూర్చోవాల్సిందే. ఈ సీసీ కెమెరాలను హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ కమాండెంట్‌కు అనుసంధానం చేశారు. ఉమ్మడి జిల్లా కళాశాలల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు డిప్యూటీ సెక్రెటరీగా ఉన్న ఆర్.వెంకటేశ్వర్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో దాదాపు 200 మంది జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అంతగా అధ్యాపకుల కొరత లేదు. గుడిహత్నూర్, తలమడుగు, నార్నూర్ మండలాల్లో ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లు ఉన్నారు. ప్రస్తుతం లెక్చరర్లకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తుండగా, ఆగస్టు 1 నుంచి ఫేషియల్ అటెండెన్స్ అమలు కానుంది. దీంతో ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాలు
కమిషనరేట్ నుంచే పర్యవేక్షణ
అధ్యాపకుల గైర్హాజరుకు ఇక చెక్
విద్యార్థులకు అందనున్న నాణ్యమైన బోధన
జిల్లాలో
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు : 13
ప్రథమ సంవత్సరం విద్యార్థులు : 3,100
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు : 3,506
అన్ని కళాశాలల్లో సీసీ నిఘా..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ నిఘా ఏర్పాటు చేశాం. ఒక్కో కళాశాలలో 14 కెమెరాల చొప్పున అమర్చడం జరిగింది. వీటి ద్వారా లెక్చరర్ల స మయపాలన, కచ్చితంగా బోధన, చదువులో నాణ్యత పెరుగుతుంది. ఏవైనా సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతాయి. వీటిని ఆయా కళాశాలల నుంచి హైదరాబాద్‌లోని ఇంటర్మీడియెట్ బోర్డు కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం జరిగింది. పర్యవేక్షణ కోసం ఉమ్మడి జిల్లాకు ఒక్కరు చొప్పు న ప్రత్యేక అధికారులను నియమించారు.
– జాదవ్ గణేశ్‌కుమార్, డీఐఈవో

కళాశాలపై నిఘా

కళాశాలపై నిఘా