సాక్షి,ఆదిలాబాద్: కుమురంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో నం.49ను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయంగా మైలేజ్ పొందేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలోని హస్తం పార్టీ గిరిజన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలంతా కలిసి ఈ జీవో నిలుపుదల విషయంలో తీవ్ర ప్రయత్నాలు చేశామని చెబుతున్నారు. అయితే ఇది స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసిందని, దాన్ని పూర్తిగా రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదని ఆదివాసీలు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా బంద్ ప్రభావంతో..
ప్రస్తుతం జీవో నం.49 చుట్టే రాజకీయ చర్చ సాగుతుంది. ప్రధానంగా గత సోమవారం ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు బంద్ పిలుపునివ్వడం, అది సక్సెస్ కావడంతో ఆ సాయంత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలిక నిలిపివేత నిర్ణయం వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదే రోజు హైదరాబాద్‌లో హస్తం పార్టీకి చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను సన్మానించారు. ఆ తర్వాత ఆదివాసీ సంఘాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే దీన్ని పూర్తిగా రద్దు చేసేవరకు తమ పోరాటం ఆపమని స్పష్టం చేస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 28న కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు సమాయత్తం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆదివాసీ సంఘాలు దిగివచ్చాయని అనుకుంటున్న సందర్భంలో మహా ధర్నా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ జీవోను నిలుపుదల చేశామంటూ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేస్తుండటం గమనార్హం. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి.
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి..
తాత్కాలికంగా నిలుపుదల చేసిన ఈ జీవో విషయంలో ఆదివాసీలు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు పూర్తిస్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటున్నారు. ఈ జీవో విషయంలో ఆదివాసీ సంఘాలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలికంగా నిలుపుదలతో పోరాటా న్ని విరమించకుండా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే కుమురంభీం ఆసిఫాబాద్‌లో త్వరలో మహాధర్నాకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆదివాసీలకు అండగా ప్రజాప్రభుత్వం
ఆదివాసీలకు ప్రజాప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. జీవో నం.49 నిలుపుదల విషయంలో గతంలో ఆదివాసీలకు మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకున్నాను. ప్రభుత్వం అన్ని కోణాల్లో చర్చించి నిలుపుదల నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రుల విజ్ఞప్తి, ఆదివాసీల ఆందోళన, అధికారుల నివేదికలను పరిశీలించిన సీఎం జీవో నిలుపుదలకు ఆదేశించారు. దానికి అనుగుణంగా అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
– జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి
పోరాటం ఆగదు..
ఆదివాసీ ప్రజా ఉద్యమం కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను నిలుపుదల చేసింది. అయితే రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు. 28న కుమురంభీం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చాం. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉంది.
– గోడం గణేశ్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు
● జీవో నిలుపుదలపై క్రెడిట్ కోసం కాంగ్రెస్ నేతల పాట్లు