
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
● కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్: మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం నిర్వహించిన మహాలక్ష్మి సంబురాల్లో పాల్గొని మాట్లాడా రు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భా గంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు. ప్రయాణ చార్జీల రూపంలో రూ.6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. జిల్లాలో 1.75 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని వివరించారు. అనంతరం బస్టాండ్‌లో తీర్చిదిద్దిన రంగవల్లులను వీక్షించి ప్రయాణికులు, విద్యార్థులు, సిబ్బందిని అభినందించారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. పలువురు మహిళా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోమరాజు భవాని ప్రసాద్, డిపో మేనేజర్ ప్రతిమ, సారథి కళాకారులు ప్రయాణికులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ఆదిలాబాద్‌రూరల్: మావల మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజర్షిషా బుధవారం రాత్రి తనిఖీ చేశారు. భోజన, వసతిగృహ శుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వలను పరిశీలించి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. భోజనం, విద్యాబోధన తీరుపై ఆరా తీశారు.