
కాలువల్లో వ్యర్థాలేయొద్దు
నెల్లూరు(బారకాసు): కాలువల్లో మురుగు ప్రవాహానికి అడ్డంకిగా మారే ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ నందన్ ఆదేశించారు. 42వ డివిజన్లోని మన్సూర్‌నగర్, పరమేశ్వరినగర్‌లో మంగళవారం ఆయన పర్యటించారు. రామిరెడ్డి కాలువలో వ్యర్థాలేయకుండా సంబంధిత సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం 46వ డివిజన్లోని బృందావనం, శ్రీనివాసాగ్రహారం, రామచంద్రారెడ్డి ఆస్పత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి.. కాలువలపై అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు. 42వ డివిజన్లో నగరపాలక సంస్థకు చెందిన వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు.
Æ శిక్షణ ద్వారా వ్యాపారంలో మెళకువలను నేర్చుకోవాలని కమిషనర్ నందన్ సూచించారు. యాంట్రప్రెనార్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా స్మార్ట్ స్ట్రీట్ వెండార్లకు మెప్మా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణను నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశం మందిరంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిరుపేద మహిళలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించిన శిక్షణను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా చైన్నెలో ఫీల్డ్ వెరిఫికేషన్‌కు తీసుకెళ్లి స్ట్రీట్ వెండింగ్ విధానాలపై అవగాహన కల్పించనున్నామని వెల్లడించారు. ట్రెయినర్లుగా రాజ్యలక్ష్మి, మధు వ్యవహరించారు.
Æ ట్యాక్స్ రివిజన్ సర్వేను అన్ని డివిజన్లలో పూర్తిస్థాయిలో ముగించి సమగ్ర నివేదికను అందజేయాలని కమిషనర్ నందన్ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ శాఖతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ వసూళ్లను 20 శాతం అదనంగా పెంచాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Æ కార్పొరేషన్ కార్యాలయంలోని పలు విభాగాలను కమిషనర్ నందన్ పరిశీలించారు. ప్రజలకు సంబంధించిన సేవలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని సూచించారు.