
భూసారం ఆధారంగా ఎరువులు వాడాలి
● కలెక్టర్ రాజర్షిషా
నార్నూర్: రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా పరీక్ష ఫలితాల పత్రాలు పంపిణీ చేశారు. మోతాదు మేరకే ఎరువులు వాడాలని సూచించారు. లేకుంటే నేల భూసారం కోల్పోయి పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. అనంతరం తాడిహత్నూర్ శివారులో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. నార్నూర్‌ను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఉద్యానశాఖ కృషి చేస్తుందన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వశోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సందర్శించారు. నిర్వాహకులను అభినందించారు. వన మహోత్సవంలో భాగంగా స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం మోడల్ స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఆయన వెంట డీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌స్వామి, తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, సీడీపీవో శారద, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఏంఈవో అనిత, ఈఎంఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ ఆంజనేయులు, ఏవో అకాశ్‌తో పాటు వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో విద్య, వైద్యం మెరుగుపరచాలి
ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు కోరారు. మండల పర్యటనకు విచ్చేసిన కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ రావు, మండల అధ్యక్షుడు శ్రీరామ్ తదితరులున్నారు.