
డుమ్మా టీచర్లకు చెక్!
● ఉపాధ్యాయులకూ ‘ఫేషియల్ రికగ్నిషన్’ ● కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ● త్వరలోనే అమలుకు చర్యలు ● గురువుల సమయపాలనపై ఫోకస్
జిల్లాలో..
ప్రాథమిక పాఠశాలలు 500
ప్రాథమికోన్నత పాఠశాలలు 119
ఉన్నత పాఠశాలలు 120
ఉపాధ్యాయ పోస్టులు 3,067
పనిచేస్తున్న వారు 2,654
ఖాళీలు 413
బయోమెట్రిక్ హాజరు వేసే
ఉపాధ్యాయులు, సిబ్బంది 65వేలు
ఆదిలాబాద్‌టౌన్: డుమ్మా టీచర్లకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. చాలామంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో కొంత మంది విధులకు హాజరుకాకపోయినా మరుసటి రోజు వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు పాఠశాల పనివేళలకు ముందుగానే ఇంటి ముఖం పట్టడం, రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించడం, చిట్టీలు నడపడం, ఇతర వ్యాపకాల్లో నిమగ్నమవుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కోవిడ్‌కు ముందు సర్కారు పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరయ్యారు. ఆ తర్వాత అవి మూలనపడడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలవుతున్న విషయం తెలిసిందే. టీచర్లకు కూడా అమలు చేస్తే సక్రమంగా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మూలనపడ్డ బయోమెట్రిక్..
సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలనే ఉద్దేశంతో 2018లో ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను తీసుకొచ్చింది. చాలా మంది టీచర్లు ‘ట్రిక్స్’ఉపయోగించి అవి అమలుకు నోచుకోకుండా చేశారు. నెట్‌వర్క్ సమస్య, యంత్రాల మరమ్మతులు, తదితర కారణాలు చూపుతూ హాజరు వేయకుండానే తప్పించుకొని తిరిగారు. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు బడుల్లో చదివే సగం మంది విద్యార్థులకు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో వెనుకబడ్డారనేది తాజాగా ఫరఖ్, ఇతర సర్వేల్లో వెల్లడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోనే ఈ దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత యంత్రాలను పునఃప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని నెలలు మాత్రమే వాటిని ఉపయోగించి మూలన పడేశారు. ఈ యంత్రాలు పనిచేసిన సమయంలో సమయపాలన పాటించేందుకు పరుగులు తీసిన టీచర్లు.. ప్రస్తు తం బయోమెట్రిక్ భయం లేకపోవడంతో ఎప్పుడైనా వెళ్లొచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అధికా రులు పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేశారు.
సొంత పనుల్లో నిమగ్నం..
ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించడం కంటే వారి సొంత పనుల్లోనే నిమగ్నమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమొచ్చినప్పుడు పాఠశాలకు రావడం, సెలవు కాకముందే ఇంటి ముఖం పట్టడం, మధ్యా హ్న సమయం తర్వాత పాఠశాలల్లో ఉండకుండా కొంతమంది తమ వ్యాపారాలు, చిట్టీలు, రియల్ ఎస్టేట్ దందాల్లో మునిగి తేలుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులు పనిచేసే చోటా పనులకు వెళ్లినప్పటికీ సెలవు పత్రం సమర్పించకుండా డుమ్మా కొడుతున్నారు. అందరు ఉపాధ్యాయులు ఒకటై వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.