
బడి బాటలో బుక్స్
● జిల్లాకు చేరిన 84 శాతం పాఠ్యపుస్తకాలు ● మండల పాయింట్లకు సరఫరా షురూ
జిల్లాలో..
మొత్తం పాఠశాలలు : 1,439
కావాల్సిన పాఠ్యపుస్తకాలు : 4,83,110
ఇప్పటివరకు చేరుకున్నవి : 4,05,700
ఇంకా రావాల్సినవి : 77,410
ఆదిలాబాద్‌టౌన్: పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించేలా విద్యాశాఖ కసరత్తు చే స్తోంది. పాఠ్యపుస్తకాల సరఫరా సైతం ప్రారంభించారు. అయితే పూర్తిస్థాయిలో ఇంకా జిల్లాకు చేరుకోలేదు. మరాఠీమీడియం పుస్తకాలు ఒక్కటి కూడా రాకపోగా , హిందీ మీడియంకు సంబంధించి లాంగ్వేజ్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జూన్ 12న పా ఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలు అందించేలా చర్యలు చేపడుతామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా సర్కారు బడుల ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమి టీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు సైతం బడులు తెరిచే రోజు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ పాఠ్యపుస్తకాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి జిల్లాకు సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రంలో మూడు గోదాములు ఏర్పాటు చేసి వాటిని భద్రపర్చారు. వాటిని ప్రస్తుతం మండల పాయింట్లకు చేరవేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా ఆదివారం నుంచి మోడల్ స్కూళ్లకు ఈ ప్రక్రియ షురూ చేయనున్నారు. మరో రెండు రోజుల తర్వాత మండలాల వారీగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే వీటిని ట్రాన్స్‌పోర్టు చేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు అయోమయంలో ఉన్నారు. రవాణా చార్జీలను పాఠ్యపుస్తకా ల సరఫరా ఇన్‌చార్జి వెచ్చించి స్కూళ్లకు పుస్తకాలను సరఫరా చేస్తున్నారు.
జిల్లాకు చేరిన 84శాతం పాఠ్యపుస్తకాలు
జిల్లాలో ప్రైవేట్ మినహా మిగతా అన్ని యాజమాన్యాలకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను స్థానిక ఆర్‌వీ ఎం గోదాం, మార్కెట్ యార్డు, పాలశీతలీకరణ కేంద్రాల్లో భద్రపర్చారు. ఇంకా 77,410 వేల పుస్తకాలు రావాల్సిఉంది. మరో 24 రోజుల వరకు గడువు ఉంది. జిల్లా కేంద్రంలో భద్రపర్చిన పుస్తకాలను ప్రస్తు తం ఆయా మండలాల ఎమ్మార్సీలకు పంపిస్తున్నా రు. అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తున్నారు. వీటికి గాను రూ.3లక్షల 50వేల వరకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు అవసరం కాగా, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఎంఈవోలు, పాఠ్యపుస్తకాల గోదాం ఇన్‌చార్జీలు ఈ చార్జీలు భరిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిధులు వచ్చిన తర్వాత వారికి బిల్లులు అందించనున్నట్లు సమాచారం.
చేరుకున్న పార్ట్–1 పుస్తకాలు
ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో పక్క ఇంగ్లీష్‌లో పాఠాలను ముద్రించారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో పార్ట్–1, పార్ట్–2గా విభజించి అందిస్తున్నారు. ప్రస్తుతం పార్ట్–1 పుస్తకాలు జిల్లాకు చేరుకోగా, పార్ట్–2 బుక్స్ ఆగస్టు, సెప్టెంబర్ వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని విభజించడం ద్వారా పుస్తకాల బరువు కూడా తగ్గింది. అయితే రెండేళ్లుగా విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇది వరకు పాఠ్య పుస్తకాల గోదాం నుంచే వీటిని సరఫరా చేయగా ఈ ఏడాది హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకే సరఫరా అవుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్నత తరగతులకు నోట్ బుక్స్ పంపిణీ చేయగా, ఈ సారి ప్రాథమిక తరగతులకు సైతం పంపిణీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
చేరని హిందీ, మరాఠీ మీడియం బుక్స్
జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 81,151 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాలకు సంబంధించిన పుస్తకాలు 84శాతం వరకు చేరుకోగా, మరాఠీ మీడియంకు సంబంధించి ఏ ఒక్క తరగతికి పుస్తకాలు రాలేదు. హిందీ మీడియంలో కేవలం ఫస్ట్ లాంగ్వేజ్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. అలాగే మూడో తరగతి ఇంగ్లీష్, ఈవీఎస్ (ఇంగ్లీష్ మీడియం), నాల్గో తరగతి తెలుగు, ఆరో తరగతి గణితం (తెలుగు మీడియం), 7,8,9వ తరగతుల హిందీ, పదో తరగతి సాంఘిక శాస్త్రం, గణితం (ఇంగ్లీష్ మీడియం) పుస్తకాలు రాలేదు. అయితే బడులు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభించాం
జిల్లాకు 84శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇప్పటికే కేజీబీవీలకు సరఫరా చేశాం. మోడల్ స్కూళ్లకు సరఫరా చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో మండలాల పాయింట్లకు పుస్తకాలను పంపిస్తాం. బడిబాట కార్యక్రమానికి ముందుగానే బుక్స్ చేరవేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. హిందీ, మరాఠీ మీడియం పుస్తకాలు జిల్లాకు చేరాల్సి ఉంది.
– ఎన్. సత్యనారాయణ,
పాఠ్యపుస్తకాల మేనేజర్, ఆదిలాబాద్