నేటితో ముగియనున్న ఫిట్‌నెస్‌ గడువు | - | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న ఫిట్‌నెస్‌ గడువు

May 15 2025 2:20 AM | Updated on May 15 2025 2:05 PM

-

● నేటితో ముగియనున్న ఫిట్‌నెస్‌ గడువు

వాహనాల కండీషన్‌పై అనుమానాలు

కాలం చెల్లిన వాటితో ప్రాణసంకటం 

ప్రైవేట్‌ యాజమాన్యాలకు అవగాహన

ఆదిలాబాద్‌టౌన్‌: బడి బస్సుల భద్రమెంతా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. స్కూల్‌ పిల్లలను తీసుకెళ్లాల్సిన సంబంధిత వాహనాల కండీషన్‌ దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన పాఠశాల యాజమాన్యాలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. కాలం చెల్లిన వాటిని రోడ్లపై తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో జిల్లాలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేటితో బడి బ స్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మంగళవారం జిల్లాలోని ఆయా పాఠశాలల స్కూల్‌ యా జమాన్యాలు, బస్సు డ్రైవర్లు, అటెండర్లతో సమావే శం నిర్వహించారు. బస్సుల నిర్వహణ, తదితర వి షయాలపై సమీక్షించారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో స్కూల్‌ బస్సులు మూలనపడ్డాయి. చాలావరకు మరమ్మతులో ఉన్నాయి. చిరిగిన సీట్లు, పగిలిన అద్దాలు, అరిగిన టైర్లు, ఫిట్‌నెస్‌ లేకపోవడం, కాలం చెల్లినవే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి బస్సులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సిన ప్రైవేట్‌ యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణాశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

నిబంధనలు బేఖాతరు..

పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా ఆయా బస్సులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర అన్నీ సక్రమంగా ఉన్నాయా.. లేదా.? అనేది చూసుకోవాలని రవా ణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్‌ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్‌ వయసు 60 ఏళ్లు మించొద్దు. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. అలాగే వాహనంలో విద్యార్థుల వివరాలు పట్టిక నమోదు చేసి ఉంచాలి. బస్సును 15ఏళ్లు మించి నడపరాదు వంటి తదితర నిబంధనలున్నాయి. అయితే జిల్లాలో మాత్రం చాలా పాఠశాలలు వీటిని పట్టించుకోవడం లేదు. కండీషన్‌ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. గతంలో ప్రమాదాలు సైతం చోటు చేసుకున్న ఘటనలున్నాయి. ప్రమాదాలు జరగకముందే అప్రమత్తంగా ఉండాల్సిన ఆ శాఖ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత వారం పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.

ముగియనున్న ఫిట్‌నెస్‌ గడువు 

జిల్లాలో 167 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఇందులో 45వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సగానికిపైగా స్కూల్‌ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు సాగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 123 ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు సంబంధించి 140 బస్సులు ఉన్నాయి. వీటికి మే 15 వరకు ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు కూడా ఇన్సూరెన్స్‌ ముగిసింది.

ఫిట్‌నెస్‌ లేని బస్సులను సీజ్‌ చేస్తాం..

ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌ తప్పనిసరిగా చేయించాలి. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్డు పైకి వస్తే సీజ్‌ చేస్తాం. నిబంధనలకు సంబంధించి డ్రైవర్లు, యాజమాన్యాలకు అవగాహన కల్పించాం. భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. స్కూల్‌ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదు.
– సీపెల్లి శ్రీనివాస్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

సీపెల్లి శ్రీనివాస్‌, జిల్లా రవాణాశాఖ అధికారి1
1/1

సీపెల్లి శ్రీనివాస్‌, జిల్లా రవాణాశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement