‘ఎర్లీబర్డ్’కు స్పందన అంతంతే!
● ముందుకు రాని పట్టణవాసులు ● మిగిలింది మూడు రోజులే ● ముందస్తుగా చెల్లిస్తే 5శాతం రాయితీ
కైలాస్‌నగర్: మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకా యిలు పేరుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి పాత బకాయిలు లేనటువంటి వారిని అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 30 వరకు పన్ను చెల్లింపునకు అవకాశం కల్పించింది. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. అయితే పట్టణ వాసుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటి వరకు కేవలం నాలుగు శాతం మాత్రమే పన్ను వసూలు కావడం గమనార్హం.
అరకొర స్పందనే ...
ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డులున్నాయి. ఎర్లీబర్డ్ పథకం అమల్లో భాగంగా నిర్దేశించిన పన్ను వసూళ్ల కోసం బల్దియా అధికారులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు ఉద్యోగులను నియమించారు. బకాయిలు లేని వారి వివరాలతో కూడిన జాబితాతో పాటు పీవోఎస్ యంత్రాలను వారికి అందజేశారు. దీంతో వారు ఉదయం, సాయంత్రం వేళల్లో కేటాయించిన వార్డుల్లో విస్తృతంగా తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ఏటా ఆస్తి పన్నులో ప్రభుత్వం వడ్డీ మాఫీ అమలు చేస్తూ వస్తోంది. పాత బకాయిలు కలిగిన వారికి వడ్డీపై 95శాతం రాయితీ కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బల్దియాకు అవసరమైన నిధులు సేకరించాలనే ఉద్దేశంతో ఎర్లీబర్డ్ స్కీం అమలు చేసి ఈ నెల 30 వరకు పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 2023–24లో ఇదే స్కీంలో రూ.1.83 కోట్లు వసూలు చేశారు. అలాగే 2024–25లో రూ.2.13 కోట్లను వసూలు చేశారు. తాజాగా గడిచిన 26 రోజుల వ్యవధిలో 3,993 మంది రూ.1.40 కోట్ల పన్నులను చెల్లించారు. మరో మూడు రోజులే గడువు ఉండటంతో గతేడాది లక్ష్యాన్ని అధిగమిస్తారా లేక వెనుకబడుతారా అనేది చూడాల్సిందే.
ప్రచారం కొరవడడంతోనే
ముందస్తుగా పన్ను చెల్లింపునకు పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఐదు శాతం రాయితీ సద్వినియోగం చేసుకునేలా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బల్దియా యంత్రాంగం ఆ దిశగా క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వ్యాపారులు పన్ను చెల్లింపునకు ముందుకొచ్చేలా గతేడాది పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లతో ప్రత్యేక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే వార్డుల్లోని ప్రజలకు విషయం తెలియజేసేలా మైక్‌తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. ఈ యేడాది కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి మమ అనిపించారు. దీంతో ప్రజలకు అవగాహన కొరవడింది. ప్రత్యేక బృందాలు వెళితే తప్ప విష యం తెలియని పరిస్థితి. ఈ క్రమంలో బల్దియా ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో..
అసెస్‌మెంట్లు : 49,503
వాటి ఆస్తి పన్ను డిమాండ్ :
రూ.33.46 కోట్లు
ఆస్తి పన్ను చెల్లించిన
అసెస్‌మెంట్లు : 3,993
ఇప్పటి వరకు వసూలైంది : రూ.1.40 కోట్లు
సద్వినియోగం చేసుకోవాలి
పన్నులు ముందస్తుగా వసూలు చేసేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం అమలు చేస్తోంది. ఈ నెల 30వరకు పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తున్నాం. పట్టణంలోని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– స్వామి, బల్దియా రెవెన్యూ అధికారి


